logo

పింఛను భిక్ష కాదు హక్కు

పింఛను భిక్ష కాదని ప్రతి ఉద్యోగి హక్కు అని ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా అన్నారు.

Published : 01 Apr 2023 04:46 IST

పాత విధానం పునరుద్ధరించకపోతే నిరవధిక సమ్మె
ఏఐఆర్‌ఎఫ్‌ ప్రధాన కార్యరద్శి శివగోపాల్‌ మిశ్రా
 సంఘీభావం తెలిపిన ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు

విజయవాడ(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే : పింఛను భిక్ష కాదని ప్రతి ఉద్యోగి హక్కు అని ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా అన్నారు. ఉద్యోగులకు నష్టం చేకూర్చే నూతన పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది నవంబరు వరకు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని ఆలోగా పునరుద్ధరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. జూన్‌, జులైలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. శుక్రవారం మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కనీస గ్యారెంటీ పింఛను లేకపోవడం వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సామాజిక భద్రతకు విఘాతం ఏర్పడుతుందన్నారు. మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి తాము పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కోశాధికారి మురళీధర్‌, సహాయ కార్యదర్శులు ఉదయభాస్కర్‌, వరప్రసాద్‌, సరోజినిరెడ్డి, డివిజనల్‌ కార్యదర్శి జీఎన్‌ శ్రీనివాసరావు, జోనల్‌ ఉపాధ్యక్షురాలు లీల, మహేష్‌నాయుడు, భానుబాబు, వై.వాణికుమారి, సీఐటీయూ నాయకులు బాబూరావు, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని