logo

అక్రమాలపై విచారణ చేస్తాం: పీడీ

జగనన్న కాలనీలోని మెరక పనుల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి (ఎఫ్‌ఏసీ), డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ స్పష్టం చేశారు.

Published : 01 Apr 2023 04:46 IST

ఈనాడు, అమరావతి: జగనన్న కాలనీలోని మెరక పనుల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి (ఎఫ్‌ఏసీ), డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల పనులను పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖలే పర్యవేక్షిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. చేసిన పనులకు ఎంబుక్‌లు తయారు చేసి శాఖకు పంపిన తర్వాత ప్రధాన కార్యాలయం నుంచి ఆయా శాఖలకే నిధులు విడుదలవుతున్నాయన్నారు. ఈ పనులను జిల్లా కలెక్టర్‌ టెండర్‌ లేదా నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తున్నారని తెలిపారు. ‘మెరక పేరుతో నిధుల మేత’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కృష్ణా జిల్లాలో 13,873 గృహాల నిర్మాణం లక్ష్యం కాగా 13,919 పూర్తి చేశామన్నారు. దాదాపు 12,700 మంది గృహప్రవేశాలు నిర్వహించుకున్నారని తెలిపారు.

వీఆర్‌ఎస్‌ ఆమోదించకనే..!

పాత అధికారి వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయగా ప్రభుత్వం ఆమోదించలేదని, ఆయన అనారోగ్య కారణాల వల్ల సెలవు పెట్టారని, తర్వాత మూడు నెలల్లోపు జిల్లాలో జాయిన్‌ కాకపోవడంతో ఆయన ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి వచ్చిందని, దీంతో కలెక్టర్‌ తనకు అదనపు బాధ్యతలు అప్పగించారని వివరణ ఇచ్చారు. జగనన్న కాలనీలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.4.84కోట్లు పీఆర్‌ శాఖ బిల్లులు చెల్లించారని, మున్సిపల్‌ శాఖ రూ.8.08 కోట్లకు బిల్లులు ఇచ్చారని వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ జిల్లా అధికారి ఆ జిల్లా చెల్లింపులు చూసుకుంటున్నారని, తన వద్ద చెల్లింపుల అధికారం లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని