logo

‘కొడాలి నానిని పోషించి.. రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశం’

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోషించింది... రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమని ఆయన గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ అన్నారు.

Updated : 13 Apr 2023 08:16 IST

నిమ్మకూరులో ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పిస్తున్న రామకృష్ణ

నిమ్మకూరు(పామర్రుగ్రామీణం), న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోషించింది... రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమని ఆయన గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన ఎన్టీఆర్‌ స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబునాయుడు అన్యాయం చేశారని కొడాలి నాని పదే పదే అంటున్నారని ప్రస్తావించగా ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందని, తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడని బదులిచ్చారు.


రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది...

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడుతూ తెలుగు ప్రజలు చాలా కష్టపడుతున్నారని, అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అడుక్కోవడానికి చిప్పకూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్నా, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నా చంద్రబాబునాయుడికే సాధ్యమన్నారు. చంద్రబాబునాయుడు నిమ్మకూరు వస్తుండడంతో గ్రామస్థులకు సంతోషంగా ఉందని, ఇంటి అల్లుడు వస్తున్నప్పుడు ఎవరికైనా సంతోషమే కదా అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ మనుమరాలు, నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని మాట్లాడుతూ నిమ్మకూరు రావడం చాలా ఆనందంగా ఉందని, ఆడపడుచు వచ్చిందని అందరూ గౌరవిస్తున్నారన్నారు. తాత నందమూరి తారకరామారావు తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడన్నారు. ఈ సంరద్భంగా గ్రామంలోని ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు రామకృష్ణ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమార్‌రాజా, ఇతర పెద్దలు నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని