logo

బదిలీల్లో గందరగోళం

ప్రభుత్వ విధానపరమైన లోపాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రక్రియ నిర్వహించినా ఏదో ఒక సమస్యతో గందరగోళంగా మారుతోంది.

Published : 29 May 2023 05:31 IST

నిబంధనలపై ఉపాధ్యాయుల ఆందోళన

ధ్రువపత్రాల పరిశీలనకు డీఈవో కార్యాలయానికి వచ్చిన ఉపాధ్యాయులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వ విధానపరమైన లోపాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రక్రియ నిర్వహించినా ఏదో ఒక సమస్యతో గందరగోళంగా మారుతోంది. ఇప్పటికే నిర్వహించిన సర్దుబాటు, తాత్కాలిక పదోన్నతుల్లో ఈ విషయం స్పష్టమైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న బదిలీల వ్యవహారం ఆ కోవకే చెందుతుంది. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటిలా తయారయ్యిందని సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో అనేకమంది పదోన్నతులు కూడా వదులుకుని ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

పాయింట్లు కోల్పోతున్నామని ఆవేదన

ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీ ఉపాధ్యాయుల్లో 5, 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 1941మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరూ తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. అభ్యర్థనలతో కలిపి మొత్తం 6వేలమంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల వల్ల చాలామంది ఉపాధ్యాయులు పాయింట్లు కోల్పోతున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇప్పటివరకు పాఠశాలల్లో చేరిన తేదీ నుంచి 8 ఏళ్ల సర్వీసు లెక్కగట్టేవారు. ప్రస్తుతం కేవలం విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో వేలాదిమంది ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయులకు 8 ఏళ్లు, హెచ్‌ఎంలకు ఐదేళ్లు సర్వీసు పూర్తయితే బదిలీ కావాలి. వారికి  ఆ సర్వీసు పూర్తయినా, విద్యాసంవత్సరాల వారీగా చూస్తే  ఏడున్నరేళ్లు మాత్రమే అవుతుందని, దీనివల్ల పాయింట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. ఇంతకు ముందు పాఠశాలల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేసే క్రమంలో సర్దుబాటు ప్రక్రియ నిర్వహించారు. ఆ సమయంలో వేరే పాఠశాలకు వెళ్లిన వారు కూడా ప్రస్తుతం మళ్లీ బదిలీ కావాల్సి వస్తుంది. అలాంటివారికి బోనస్‌గా ఇచ్చే పాయింట్లతోపాటు ఇంతకు ముందు పనిచేసిన పాఠశాలల్లో ఉన్న సర్వీసుకు కూడా పాయింట్లు కేటాయిస్తున్నారు. దీనివల్ల ఒకే పాఠశాలలో సర్వీసు పూర్తి చేసిన సీనియర్‌ ఉపాధ్యాయులు  నష్టపోతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించకపోవడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

ఉద్యోగోన్నతులకూ విముఖత

సాధారణంగా ఉద్యోగులు ఎవరైనా సరే పదోన్నతుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈసారి విచిత్రమేమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు పదోన్నతులు కూడా  వదులుకుంటున్నారు. ఇప్పటికే హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ  చేసేందుకు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. మళ్లీ మూడో విడత ఈనెల 29న నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. గతేడాది నెలల వ్యవధిలో రెండు సార్లు పదోన్నతులు ఇస్తామని ఉపాధ్యాయుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. తరువాత అంశం కోర్టులో ఉందని రూ.2,500 అలవెన్సు ఇస్తామని నాలుగునెలలు పనిచేయించుకున్న తరువాత అన్నింటినీ రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలామంది పదోన్నతులు మాకొద్దని తెగేసి చెబుతున్నారు. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్‌జీటీల నుంచి స్కూల్‌అసిస్టెంట్‌ పదోన్నతుల విషయంలోనూ చాలామంది విముఖత చూపిస్తున్నారు. ఒక్క ఇంగ్లీషు సబ్జెక్టులోనే 40మంది ఉపాధ్యాయులు పదోన్నతుల పట్ల విముఖత చూపించి అనంగీకార పత్రాలు అందజేశారు.మిగిలిన సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూపకుండా పదోన్నతులు కావాలా వద్దా అని చెప్పడాన్ని ఉపాధ్యాయులు ముక్తంకంఠంతో ఖండిస్తున్నారు. తొలుత అంగీకారం ఇస్తే ఎక్కడ పోస్టు కేటాయిస్తే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమోనని పదోన్నతులను కూడా వదిలేసుకుంటున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చెప్పిందొకటి... జీవోలో మరొకటి

మద్ది బాబూరాజేంద్రప్రసాద్‌, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు

ప్రభుత్వం మా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించినప్పుడు మా డిమాండ్లకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తామని చెప్పింది. కానీ జీవోలో ఆ అంశాలను పేర్కొనలేదు. ఖాళీలు ముందుగా ప్రకటిస్తామన్నారు..ప్రస్తుతం ఖాళీలు చూపకుండా పదోన్నతులు అంటున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతున్నాం.

వేలాది మంది నష్టపోతున్నారు

ఎ.సుందరయ్య, యూటీఎఫ్‌, ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

కమిషనరేట్‌లో అధికారులు చెబుతున్నదానికి...క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్న దానికి పొంతన ఉండడం లేదు. ప్రధానంగా 2015లో జరిగిన బదిలీల్లో కదిలిన వారికి 8 ఏళ్ల సర్వీసు పూర్తవుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాదిమంది నష్టపోతున్నారు. విద్యా సంవత్సరాలు కాకుండా సర్వీను ప్రామాణికంగా తీసుకోవాలి..లేదా వారికి సర్వీసుకు సరిపడా పాయింట్లు అయినా కేటాయించాలి. ఖాళీలను బ్లాక్‌చేయకుండా అన్నింటినీ ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని