logo

అడిగేదెవరు.. బాదెయ్‌..!

వేసవి రద్దీని పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.డిమాండ్‌ ఉన్న రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు.

Updated : 31 May 2023 06:15 IST

వేసవి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు

గిరాకీని బట్టి టికెట్‌ ధరలను పెంచేస్తున్న ట్రావెల్స్‌

ఈనాడు- అమరావతి: వేసవి రద్దీని పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.డిమాండ్‌ ఉన్న రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు. సాధారణం కంటే 40 శాతం నుంచి 50 శాతం అధికంగా ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ధరలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లే వారు చేసేది లేక చెల్లిస్తున్నారు. ప్రయాణికుల వాహనాల్లో వాణిజ్య సరకులను చేరవేయకూడదు. వారికి సంబంధించిన వాటినే తీసుకెళ్లాలి. చాలా బస్సుల్లో డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారీతిన సరకులను తీసుకెళ్తున్నారు. ఉల్లంఘనలపై కొరడా ఝళిపించాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా విజయవాడ కేంద్రంగానే ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీలు నడుస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తదితర చోట్లకు వెళ్తుంటాయి. ఏసీ, నాన్‌-ఏసీ, స్లీపర్‌ సర్వీసులు తిరుగుతున్నాయి. విజయవాడ నగరం మీదుగా నిత్యం 550 బస్సుల వరకు నడుస్తుంటాయి. శని, ఆదివారాలు మినహా సాధరాణ రోజుల్లో వీటిల్లో పెద్దగా డిమాండ్‌ ఉండదు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు రద్దీగా సమయాలలో రెట్టింపు చేసి టికెట్లు అమ్ముతుంటారు. పండగ సీజన్లలో వారం రోజులపాటు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో అయితే నెల నుంచి నెలన్నర వరకు రద్దీ కనిపిస్తుంది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎడాపెడా ధరలను వసూలు చేశారు. డిమాండ్‌ మేరకు రెట్టింపు కూడా చేస్తున్నారు. ఇక వారాంతాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటోంది.

* విజయవాడ నగరంతోపాటు ఇతరచోట్ల ఉత్తరాంధ్ర నుంచి వచ్చి పనులు చేసుకునే వారు అధికంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు డిమాండ్‌ ఉంటోంది. విశాఖపట్నం వెళ్లే నాన్‌- ఏసీ బస్సుల్లో గరిష్ఠంగా రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఇది ఆర్టీసీతో పోలిస్తే రెట్టింపు ధర. ఏసీ బస్సుల్లో సీటు రూ.1,300 దాకా పలుకుతోంది. పలు ట్రావెల్స్‌ అయితే.. ఏసీ స్లీపర్‌ బస్సుల్లో ఎక్కితే ఏకంగా రూ.2,300 చెల్లించాల్సి వస్తోంది.

* డిమాండ్‌ ఎక్కువ ఉండే బెంగళూరు మార్గంలోనూ ఇదే రీతిలో ధరలు ఉంటున్నాయి. నాన్‌-ఏసీ సర్వీసుల్లో సాధారణం కంటే 30 శాతం అధికంగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నారు. పలు ఏసీ బస్సుల్లో రూ.1,700 వరకు, ఓల్వో మల్టీ యాక్సిల్‌ బస్సుల్లో రూ.3 వేలు వరకు ముక్కు పిండి తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ రూట్‌లోనూ అధిక ధరలు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. నాన్‌-ఏసీ సర్వీసుల్లో ఆర్టీసీ కంటే రెట్టింపు ధరలు ఉన్నాయి. వారాంతాల్లో డిమాండ్‌ను బట్టి రూ.1,200 వసూలు చేస్తున్నారు. ఏసీ 2 ప్లస్‌ 1 బస్సుల్లో రూ.1,700-2,000 వరకు ఉంటోంది.

పైనా, కిందా సరకుల రవాణా...

పరిమితికి మించి యథేచ్ఛగా సరకులను వేసి తరలిస్తున్నాయి. విజయవాడ నుంచి పలు వ్యాపార వస్తువులను బుక్‌ చేసుకుని పార్శిల్‌ ఏజెన్సీల మాదిరిగా రవాణా చేస్తున్నారు. చాలా ట్రావెల్స్‌ సంస్థలు ఇలా అనుమతి లేకుండా చేరవేస్తున్నాయి. ప్రయాణికులను మాత్రమే చేరవేసేందుకు అనుమతి ఉన్నా దీనికి విరుద్ధంగా ఆపరేటర్లు వివిధ సరకులను రవాణా చేస్తున్నారు. వెరసి ప్రయాణికుల వాహనాలు సరకు రవాణా వాహనాలుగా మారుతున్నాయి. విజయవాడ నుంచి బిందెలు, ఇతర వ్యాపార వస్తువులను బుక్‌ చేసుకుని పార్శిల్‌ ఏజెన్సీల మాదిరిగా రవాణా చేస్తున్నారు. పలు బస్సుల డిక్కీల్లో స్కూటీలు కూడా చేరవేస్తున్నారు. ఇలా వాహనాలను తీసుకెళ్లడం వల్ల వాటిలోని ఇంధనం మండి బస్సులు అగ్నిప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. బస్సుల పై భాగంలో, కింద ఛాంబర్లలో వాణిజ్య సరకులు రవాణా అవుతున్నాయి.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని