logo

సంపద సృష్టి.. సంక్షేమం.. చంద్రబాబుకే సాధ్యం

సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని అందించడం తెదేపా అధినేత చంద్రబాబుకే సాధ్యమని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 31 May 2023 05:06 IST

తెదేపా అధినేత చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని అందించడం తెదేపా అధినేత చంద్రబాబుకే సాధ్యమని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మహానాడులో తొలి విడత ఎన్నికల ప్రణాలికలో మహిళలు, రైతులు, యువతకు భరోసా కలిగించే సంక్షేమ పథకాలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు చిత్ర పటానికి పాలాబిషేకం చేశారు. మహానాడులో చంద్రబాబు ప్రసంగం అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిందన్నారు. టీజర్‌కే వైకాపా బెంబేలెత్తిపోతే సినిమా విడుదలైతే సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైకాపా నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారని, ఇసుక, మట్టి దోపిడీ ద్వారా అక్రమార్జనకు పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

తమ్మినేనిపై చర్యలు తీసుకోండి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ చేసిన వ్యాఖ్యలకు బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడరాదని చెప్పారు. చంద్రబాబు నాయుడికి జడ్‌ ప్లస్‌ భద్రత లేకపోతే ఫినిష్‌ అయిపోతాడని మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబుకు వైకాపా ప్రభుత్వంతో ప్రమాదం పొంచి ఉందని అర్థమౌతోందని చెప్పారు. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనలేక కుట్రలకు తెరతీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉంటే స్పీకర్‌ తమ్మినేనిపై వెంటనే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని బుద్ధప్రసాద్‌ కోరారు. మండలి వెంకట్రామ్‌, కొల్లూరి వెంకట్రావు, యాసం చిట్టిబాబు, తలశిల స్వర్ణలత, బండే కనకదుర్గ పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని