logo

నిబంధనలు తూచ్‌..!

నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుకలకు గిరాకీ పెరగడంతో బట్టీలు కూడా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.

Published : 31 May 2023 05:06 IST

విచ్చలవిడిగా బట్టీల ర్పాటు

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు: నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుకలకు గిరాకీ పెరగడంతో బట్టీలు కూడా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 700కు పైగా ఇటుక బట్టీలున్నాయని అధికారులు చెబుతున్నారు. నివాస ప్రాంతాలు, రహదారులకు దూరంగా ఇటుకలు తయారు చేయాలని నిబంధనలున్నప్పటికీ వ్యాపారులు వాటిని తుంగలో తొక్కుతున్నారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నడుస్తున్నాయి.

అనుమతులు లేకున్నా

ఇటుక తయారీకి రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలితోపాటు స్థానిక పంచాయతీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. భూమి వినియోగిస్తున్నందుకు ప్రభుత్వానికి నిర్ణీత రుసుము చెల్లించాలి. కానీ బట్టీల నిర్వాహకులు వాటిని పాటించడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు, లంకల్ని సైతం వదలడం లేదు. నది ఒడ్డున కూడా బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మట్టి కోసం గ్రామాల చెంతన ఉన్న లంకల్లో యథేచ్ఛగా తవ్వేస్తుండడంతో లంకభూములు నదీ పాతానికి గురవుతున్నాయి.

ఇవీ మార్గదర్శకాలు

ఇటుక బట్టీలు గ్రామానికి, పండ్ల తోటలకు కనీసం 0.8 కిలో మీటర్ల దూరంలో ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది. బట్టీలన్నీ ఒకేచోట ఏర్పడితే వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే కారణంగా కనీసం కిలో మీటరు దూరం పాటించాలని షరతు విధిచింది. ఇటుకలను కాల్చడానికి టైరు, ప్లాస్టిక్‌ వంటి ప్రమాదకర వ్యర్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని స్పష్టం చేసింది.

బీమా సౌకర్యం సున్నా

బట్టీలో పనిచేసే కార్మికులకు నిర్వాహకులు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు నిబంధనల పేరుతో హడావుడి చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తవని పలువురు సూచిస్తున్నారు. బట్టీల పర్యవేక్షణపై తహసీల్దార్‌ కట్టా శివయ్య వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా ఆ బాధ్యత పంచాయతీలదని తెలిపారు.

పరిశీలించి అనుమతులిస్తాం

కాలుష్య నియంత్రణ మండలి అనుమతి తప్పని సరి. పొలంలో బట్టీ ఏర్పాటు చేస్తే భూమార్పిడి ధ్రువపత్రం, చుట్టుపక్కల రైతుల అభ్యంతరాలు లేకుండా తీర్మాన కాపీలు ఉండాలి. అన్నీ పరిశీలించి సక్రమంగా ఉంటేనే గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు మంజూరు చేస్తాం.

తుంగల స్వర్ణలత, ఎంపీడీవో

తీవ్రమైన కాలుష్యం

రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఉండటంతో విపరీతంగా పొగ వెలువడి తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. పొగ కారణంగా ప్రమాదాలు కూడా చోటుచేసుకునే ఆస్కారం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని