logo

సారొత్తే.. సుక్కలే!

అసలే పద్మవ్యూహాన్ని తలపించే బెజవాడ ట్రాఫిక్‌.. ఆపై మంగళవారం సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా నగరవాసులు నరకం చవిచూశారు.

Updated : 31 May 2023 06:14 IST

సీఎం పర్యటనతో గంటలకొద్దీ ఆంక్షలు

బందరు రోడ్డులో రంగా విగ్రహం కూడలిలో నిలిచిన వాహనాలు

ఈనాడు - అమరావతి: అసలే పద్మవ్యూహాన్ని తలపించే బెజవాడ ట్రాఫిక్‌.. ఆపై మంగళవారం సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా నగరవాసులు నరకం చవిచూశారు. విజయవాడలో కీలకమైన బందరు రోడ్డులో పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్‌ చాలా సేపు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. నగరంలోని రాఘవయ్య పార్కు పక్కనే ఉన్న నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను ఉదయం 10.30 గంటల సమయంలో సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసుల తీరు కారణంగా ప్రయాణికులు, ప్రజలకు అవస్థలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాఘవయ్య పార్కు పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు గంటలపాటు ఆంక్షలు విధించారు.

నిర్దేశిత సమయం ప్రకారం జగన్‌.. నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు ఉదయం పది గంటలకు రావాల్సి ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ నగరంలోకి ప్రవేశించిన తర్వాత నేతాజీ వంతెన మార్గంలో బందరు రోడ్డులోకి ప్రవేశించారు. ఆయన రాక చాలా ముందు నుంచే పశువుల ఆసుపత్రి కూడలి నుంచి పీసీఆర్‌ కూడలి వరకు అడ్డరోడ్లను పూర్తిగా మూసివేశారు. దీని వల్ల నగరవాసులు కష్టాలు తప్పడం లేదు. ఇతర మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తీవ్ర రద్దీ ఉంటుంది. ఈ సమయంలో కార్యాలయాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట ఉద్యోగులు, ఇతరులు ఎక్కువ సంఖ్యలో ఉంటుంటారు. సరిగ్గా ఇదే సమయంలో బందరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. బెంజి సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండుకు బందరు రోడ్డులో నుంచి వెళ్లే సిటీ బస్సులను దారి మళ్లించారు. మందుగా చెప్పకపోవడంతో ఆయా బస్టాప్‌లలో నిరీక్షిస్తున్న వారికి నిరాశే ఎదురైంది.

వెళ్లిన తర్వాతా.. చాలా సమయం

ముఖ్యమంత్రి రాక ముందే.. తిరుగు పయనమయ్యే మార్గంలోని అడ్డరోడ్లనూ మూసివేశారు. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతం బీసెంట్‌ రోడ్డు. నిత్యం షాపింగ్‌కు వచ్చే వారితో ఇది కిక్కిరిసి ఉంటుంది. ఈ రోడ్డులోకి వెళ్లే మార్గాన్ని కూడా ఉదయం 9 గంటల నుంచే మూసేశారు. ఫలితంగా బందరు రోడ్డులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. పీసీఆర్‌ కూడలి నుంచి బెంజి సర్కిల్‌ వైపు మార్గాన్ని 10.30 గంటలకే పూర్తిగా నిలిపారు. తిరిగి 11.15 గంటలకు అనుమతించారు. పాతబస్టాండు మార్గం గుండా ఏలూరు రోడ్డులోకి మళ్లించారు. దీని వల్ల ఈ రోడ్డుపై రద్దీ బాగా పెరిగి... ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బందరు రోడ్డులో వెళ్లాల్సిన వాహనాలను బెంజిసర్కిల్‌, రంగా విగ్రహం సెంటర్‌ మీదుగా కృష్ణలంకలోకి మళ్లించారు. దీని వల్ల కూడా బస్టాండ్‌ వద్ద వాహనాల రద్దీ ఎక్కువైంది. సీఎం వెళ్లిన తర్వాత కూడా బందరు రోడ్డులో ట్రాఫిక్‌ సాధారణ స్థితికి చేరడానికి చాలా సమయం పట్టింది.

బీసెంట్‌ రోడ్డు మూసివేత

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని