logo

పట్టాలన్నారు.. పత్తా లేకున్నారు!

ఏక మొత్తం పరిష్కారమని చెప్పి వెంటపడి మరీ డబ్బులు కట్టించుకున్నారు.. ప్రస్తుతం మమ్మల్ని  కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. ఇదీ ఓఏటీఎస్‌ పథకంలో నగదు చెల్లించిన లబ్ధిదారుల ఆవేదన.

Published : 01 Jun 2023 05:24 IST

చేతికందని ఓటీఎస్‌ పత్రాలు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఏక మొత్తం పరిష్కారమని చెప్పి వెంటపడి మరీ డబ్బులు కట్టించుకున్నారు.. ప్రస్తుతం మమ్మల్ని  కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు.. ఇదీ ఓఏటీఎస్‌ పథకంలో నగదు చెల్లించిన లబ్ధిదారుల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది నుంచి నిర్దేశించిన రుసుము చెల్లించుకున్నారు. వారిలో ఇంకా చాలామందికి పట్టాలు అందకపోవడం, అడిగినా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పక పోవడంతో ఆవేదన చెందుతున్నారు.

గృహనిర్మాణ పథకాల ద్వారా అప్పుడెప్పుడో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రుణవిముక్తి కలిగించడంతో పాటు సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించిన పాలకులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో 90వేలకుపైగా లబ్ధిదారులు ఉంటే దాదాపు 45వేలమందికి వరకు నగదు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఓటీఎస్‌ పథకాన్ని చాలామంది వ్యతిరేకించారు. నగదు చెల్లించిన వారు కూడా తొలుత విముఖత వ్యక్తం చేసినా భూమికి సంబంధించి హక్కులతో కూడిన పట్టా ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుందని నగదు చెల్లించారు.  ఏడాది దాటిపోయినా ఇంకా పట్టాలు చేతికందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి రూ.10 కోట్లకుపైగా వసూళ్లు చేశారు. డివిజన్‌ల వారీగా చూస్తే అత్యధికంగా బందరు డివిజన్‌ పరిధిలోనే వసూళ్లయ్యాయి. నగదు వసూళ్లపై చూపించిన శ్రద్ధ పట్టాల పంపిణీపై చూపడం లేదన్న విమర్శలు లబ్ధిదారులనుంచి వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల చుట్టూ తిరిగి డబ్బులు కట్టించుకున్న సిబ్బంది కూడా ఫలానా సమయంలో ఇస్తామని కూడా చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థ అధికారులేమో మండలాలకు పంపించేశామని చెబుతున్నారు. అవి ఎక్కడున్నాయో..ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి.

అధికారులకు తెలిపినా.. జిల్లాలో 1983 నుంచి 2013 మధ్యకాలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులను గుర్తించి  గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు ఇలా నిబంధనల ప్రకారం అధికారులు వసూలు చేశారు. డబ్బులు లేవంటే డ్వాక్రాలో రుణం ఇప్పిస్తామని చెప్పారు.. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌లు చేసేలా ఏర్పాట్లు చేశారు. బంటుమిల్లి మండలంలోని పెందుర్రు, చోరంపూడి, మల్లంపూడి, నాగేశ్వరరావుపేట, మల్లేశ్వరం, గూడూరు మండలంలోని ఆకులమన్నాడు, పెడన మండలంలోని చేవెండ్ర తదితర గ్రామాల్లో ఇప్పటివరకు పట్టాలు పంపిణీ చేయలేదు. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, గుడివాడ, గుడ్లవల్లేరు ఇలా పలు మండలాల వారికి పట్టాలు అందించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన జిల్లా పరిషత్‌స్థాయీ సంఘ సమావేశంలోనూ పలువురు సభ్యులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసువచ్చారు. ఇప్పటికైనా చొరవ తీసుకుని త్వరితగతిన పట్టాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.


కొందరికే ఇచ్చారు
మహ్మద్‌రఫీ, ఆకులమన్నాడు సర్పంచి

మా గ్రామంలో కొందరికే పట్టాలు ఇచ్చారు. అప్పట్లో లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, అధికారులతో కలిసి నేను కూడా తిరిగి డబ్బులు కట్టించా. వాళ్లు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. పట్టాలు వచ్చాయని అంటున్నారు కానీ ఇంతవరకు లబ్ధిదారులకు చేరలేదు.


పరిష్కరిస్తాం
సూర్యనారాయణ, జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారి

ఏకమొత్త పరిష్కారంలో భాగంగా లబ్ధిదారులకు అందించాల్సిన పట్టాలను ఇప్పటికే మండలాల వారీగా పంపిణీ చేశాం. చాలాచోట్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా ఎక్కడెక్కడ సమస్య ఉందో పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. లబ్ధిదారులు సమస్య ఉంటే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరుతున్నాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని