logo

వ్యాపకం లేదు.. వ్యాపారం లేదు..!

అమరావతి మెట్రో రైలు కార్పోరేషన్‌ (ఏఎంఆర్‌సీ) కాస్తా.. ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌(ఏపీ ఎంఆర్‌సీ)గా మారిన తర్వాత విజయవాడ పేరుకే ప్రధాన కార్యాలయం.. ఊరు విశాఖగా మారింది.

Published : 01 Jun 2023 05:31 IST

ఈనాడు, అమరావతి

నాలుగంతస్తుల వాణిజ్య భవనం.. వందల సంఖ్యలో ఉద్యోగులు.. విదేశీ ప్రతినిధులు.. సమావేశాలు.. రకరకాల డ్రాయింగులు.. సర్వేలు.. నివేదికలు.. అంతా విధినిర్వహణలో నిమగ్నం..  ఇది 2019 వరకు..

నివాస భవనంలో ఒక డబుల్‌బెడ్‌ రూం ప్లాట్‌.. నలుగురే ఉద్యోగులు.. ఇద్దరు మాత్రమే హాజరు. చేయడానికి పనిలేదు. విదేశీ ప్రతినిధులు లేరు. కార్యాలయానికి బాస్‌ రారు.. ఉద్యోగులు వస్తారు.. వెళతారు. అన్యులు అటువైపు కన్నెత్తి చూడరు. మీడియా ఆసక్తి చూపినా ‘ఎండీ లేరు.. విశాఖపట్నంలో ఉన్నారు..’ అనే సమాధానం వస్తుంది.  ఇదీ 2020 తర్వాత పరిస్థితి.

మరావతి మెట్రో రైలు కార్పోరేషన్‌ (ఏఎంఆర్‌సీ) కాస్తా.. ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌(ఏపీ ఎంఆర్‌సీ)గా మారిన తర్వాత విజయవాడ పేరుకే ప్రధాన కార్యాలయం.. ఊరు విశాఖగా మారింది. కేవలం నలుగురంటే.. నలుగురే ఉద్యోగులు. కార్యాలయ నిర్వహణకు నిధులు కొతర ఉంది. రెండేళ్ల కిందట బడ్జెట్‌లో పెట్టిన నిధులు పూర్తిగా అందలేదు. ప్రస్తుతం బడ్జెట్‌లో అసలు మెట్రో ఊసేలేదు.  పురపాలక శాఖ నుంచి నామమాత్రంగా ఉద్యోగుల వేతనాలు, ఖర్చులకు అందాల్సి ఉంది. చాలా వరకు ఒప్పంద ఉద్యోగులు ఉండేవారు. అందరూ మానేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం కార్యాలయం కళతప్పింది.

మసక బారిన మెట్రో...

గత ప్రభుత్వంలో మెట్రో కారిడార్‌కు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. మెట్రో దిగ్గజం డీఎంఆర్‌సీ ఎండీ శ్రీధరన్‌ ఆధ్వర్యంలో డీపీఆర్‌ రూపొందింది. తర్వాత సలహాదారు నుంచి డీఎంఆర్‌సీ వైదొలగింది. 2019లోనే డీఎంఆర్‌సీ సిబ్బంది దిల్లీకి తరలిపోయారు. తర్వాత వైకాపా ప్రభుత్వంలో ఒకే ఒక్కసారి మెట్రోపై సమీక్ష జరిగింది. సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో గత ప్రభుత్వం రూపొందించిన లైట్‌మెట్రో డీపీఆర్‌ను విమర్శించారు. కొత్తగా డీపీఆర్‌ తయారు చేయాలని సూచించారు. కానీ నిధులు లేక మూలన పడింది. తర్వాత ‘అమరావతి’ పదాన్ని తొలగించి ఏపీ చేర్చారు. వెంటనే కార్పొరేట్‌ కార్యాలయం కాస్తా లబ్బీపేటలోని ఒక నివాస సముదాయం (అపార్టుమెంట్‌)లో డబుల్‌ బెడ్‌రూం ఇంటికి మార్చారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి పరిస్థితిని గ్రహించి ఇది వచ్చే ప్రాజెక్టు కాదని పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆర్థిక విభాగం అధిపతిగా ఉన్న జయమన్మధరావును ఎండీగా ప్రకటించారు. ఆయన సిబ్బంది విశాఖ వెళ్లి అక్కడ ప్రాంతీయ కార్యాలయం పెట్టారు. ఇక్కడ ప్రధాన కార్యాలయం అని నామకరణం చేశారు. కానీ నలుగురే సిబ్బంది ఉన్నారు. డీఎంఆర్‌సీ రూ.70 కోట్ల వరకు తీసుకుని ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. జర్మన్‌ కంపెనీకి లైట్‌మెట్రో డీపీఆర్‌ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఉచితంగానే డీపీఆర్‌ అందించేందుకు ముందుకు వచ్చిన జర్మన్‌ కంపెనీకి కేవలం ఖర్చులు వసతి ఇతర సదుపాయాలకు ఈ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. ప్రస్తుతం విజయవాడ, విశాఖ కార్యాలయాలకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు నిర్వహణ ఖర్చులు అవుతున్నాయి. గత ఏడాది ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఇంకా రెండు త్రైమాసిక(క్వార్టర్ల) నిధులు విడుదల కాలేదు. మెట్రో కార్యాలయం మసకబారింది.

మిగిలింది నిరాశే...

మెట్రో వస్తే.. తమకు భారీ డిమాండ్‌ ఉంటుందని ఆశించిన భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఎంఈఎల్‌) సంస్థ భంగపడింది. తమ కార్యాలయాన్ని విశాఖకు తరలించేసింది. రక్షణ శాఖకు అవసరమైన భారీ యంత్రాలను ఈ సంస్థ సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా రూ.4 వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థ. విజయవాడలో దీని శాఖ కార్యాలయాన్ని 2015లో ఏర్పాటు చేశారు. మెట్రోకు అవసరమైన కోచ్‌లు సరఫరా చేసేందుకు బీఈఎంఎల్‌ ముందుకు వచ్చింది. బుల్‌డోజర్లు, గ్లాడర్‌లు వంటి యంత్రాలను ఈ సంస్థ రూపొందిస్తుంది. రాజధానిలో మెట్రోతోపాటు ఇతర కార్యక్రమాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావించినా... నిరాశే మిగిలింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు