logo

దారికొస్తేనే.. రయ్‌ రయ్‌!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో నందిగామ నుంచి విజయవాడ వైపు మినీ వ్యాన్‌లో లైటింగ్‌ సామగ్రి వేసుకుని వస్తున్నారు. అంబారుపేట క్రాస్‌ రోడ్డు వద్ద అసంపూర్తి దారిపై ఉన్న గుంతలో టైరు పడి వ్యాను బోల్తాకొట్టింది.

Published : 01 Jun 2023 05:44 IST

అసంపూర్తి నిర్మాణాలతో గాల్లో ప్రాణాలు
శాఖల సమన్వయలేమితో కొలిక్కిరాని భూసేకరణ
ఈనాడు, అమరావతి

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో నందిగామ నుంచి విజయవాడ వైపు మినీ వ్యాన్‌లో లైటింగ్‌ సామగ్రి వేసుకుని వస్తున్నారు. అంబారుపేట క్రాస్‌ రోడ్డు వద్ద అసంపూర్తి దారిపై ఉన్న గుంతలో టైరు పడి వ్యాను బోల్తాకొట్టింది. ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే రహదారి పరిధిలో.. ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందగా.. పిల్లలు అనాథలయ్యారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు అడ్డుగా పెట్టిన డివైడర్‌ను ఢీ కొట్టి... ఒకరు మృతి చెందారు.


అదీ ఓ జాతీయ రహదారి.. ఏ.కొండూరు మండలం రామచంద్రాపురంలో రెండు మూడు మీటర్ల లోతులో గోతులు ఉన్నాయి. విజయవాడ నుంచి భద్రాచలం వెళుతున్న ఓ కారు గోతులను గమనించకుండా అందులోకి వెళ్లి అక్కడికక్కడే పల్టీ కొట్టింది. టైరు చక్రం యాక్సెల్‌ విరిగి.. కారులోని వారు గాయాలతో బయటపడ్డారు. అధిక బరువుతో వచ్చే ఓ ట్రక్కు గోతుల్లో పడి అడ్డం తిరిగింది. దాన్ని తొలగించడానికి ఓ రోజంతా పట్టింది.


జిల్లా నుంచి వెళ్లే మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. అక్కడక్కడ కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారు మాత్రం బిల్లులు చేసుకుని చేతులు దులుపుకొన్నారు. రహదారి మొత్తం అద్దంలా ఉంటుంది. అసంపూర్తిగా వదిలిన ప్రాంతాలు నరకానికి దారులై.. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తి చేయడం లేదు. పరిష్కారం చూపడం లేదు. భూసేకరణ సమస్య అని జాతీయ రహదారుల సంస్థ, న్యాయపర సమస్యలు అని రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు టోల్‌ గుంజుతూనే విస్తరణను విస్మరించడమే కాక.. కనీసం మరమ్మతులూ చేయడం లేదు. మరోవైపు భద్రత చర్యలూ లేవు. వెరసి ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

జగదల్‌పూర్‌ జాతీయ రహదారి ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద దుస్థితి

భారీ గుంతలు.. ప్రమాదాలు..

విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిలో రెండు ప్రాంతాల్లో వదిలేశారు. కొండపల్లి వద్ద, రామచంద్రాపురం వద్ద మిగిలిపోయింది. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద కిలోమీటరు విస్తరణ వదిలేశారు. ఇక్కడ గ్రామం మధ్యలో నుంచి దారి వేయాల్సి ఉండగా.. గ్రామస్థులు.. బైపాస్‌ నిర్మించాలని ఆందోళనలు చేశారు. కొందరు కోర్టుకు వెళ్లారు. ఇక్కడ కీలక మలుపు ఉంది. ఇటీవల ఓ భారీ వాహనం అడ్డం తిరిగి ఇరుక్కోగా ఒకపూట వాహనాలు నిలిచాయి. తరచూ ఇక్కడ రహదారి మరమ్మతులకు గురవుతుంది. రామచంద్రాపురం ప్రజలు గత కొన్నేళ్లుగా ట్రాఫిక్‌తో నరకం చూస్తున్నారు. మార్గం తెలియని కొత్తవారైతే.. ప్రమాదం జరిగినట్లే. కనీసం గుంతలు పూడ్చలేదు. కానీ బాడవ వద్ద టోల్‌ ప్లాజా పెట్టి వసూలు చేస్తున్నారు. ఇటీవల టోల్‌ ధరలనూ పెంచారు. గుత్తేదారు మాత్రం నిర్మాణం చేసినట్లు మొత్తం బిల్లు చేయించుకున్నారు. టెండర్లు పిలుస్తున్నామని మూడేళ్లుగా చెబుతున్నా.. ఒక్క అడుగు ముందుకు కదలలేదు.

నందిగామ మండలం అంబారుపేట వద్ద జాతీయ రహదారి ఇలా..


బాబోయ్‌ నందిగామ...

హైదరాబాద్‌ జాతీయ రహదారి అంబారుపేట క్రాస్‌ రోడ్డు వద్ద పరిస్థితి మరీ దారుణం. రూ.కోట్లు వెచ్చించి నందిగామ వద్ద ఏడు కిమీ విస్తరించి... సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆరు కిమీ మేర పూర్తయింది. ఒక కిలోమీటరు ఆగి రెండున్నరేళ్లు గడిచినా కదలిక లేదు. నందిగామలోకి వెళ్లేందుకు అండర్‌ పాస్‌.. అక్కడే ఒక బస్‌బే, బస్‌స్టాప్‌ అవసరం. దీనికి భూ సేకరణపై రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అండర్‌పాస్‌ వంతెన నిర్మించారు. ఇక్కడ రాకపోకలకు జాతీయ రహదారిపై డివైడర్‌లు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. వీటిని అంచనా వేయని వాహనదారులు 100 కి.మీ వేగంతో వచ్చి ఢీ కొడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్నిసార్లు గాయాలతో బయటపడుతున్నారు. అనాసాగర్‌ వద్ద సర్వీసు రోడ్డు పరిస్థితీ ఇంతే. ఇక్కడ కూడా అండర్‌పాస్‌ నుంచి వస్తున్న వాహనాన్ని సర్వీసు రహదారి మీదుగా వస్తున్న కారు ఢీ కొని యువకుడు మృతి చెందాడు.


అలా వదిలేశారు..

విజయవాడ బందరు జాతీయ రహదారి 64 కిమీ నాలుగు వరసలుగా విస్తరించారు. రూ.800 కోట్ల ప్రాజెక్టు. దీనిలో భాగమే బెంజి పైవంతెన నిర్మాణం. రెండేళ్ల కిందట పూర్తి చేశారు. దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ కాంట్రాక్టు. కానీ మధ్యలో కొన్ని పనులు వదిలేశారు. బెంజి సర్కిల్‌ సెంటర్‌ నుంచి నిర్మించాలి.  కానీ బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ గేట్‌ వరకు వదిలేశారు. కారణం కొన్ని భవనాలను కూల్చాలి. దీనికి వీఎంసీ ముందుకు రాలేదు. దీంతో గుత్తసంస్థ ఈ భాగాన్ని కాంట్రాక్టు నుంచి మినహాయించింది. ప్రస్తుతం వీఎంసీ నిర్వాసితులకు టీడీఆర్‌ బాండ్లు ఇస్తున్నారు. మొత్తం 168 భవనాలను కూల్చాలి. ఇక్కడ ట్రాఫిక్‌ పెద్దసమస్యగా మారింది. ఇదే బందరు రోడ్డులో కంకిపాడు వద్ద, మరికొన్ని ప్రాంతాల్లో గుత్తసంస్థ నిర్మాణాన్ని వదిలేసింది.


కంకిపాడు మండలం కొణతనపాడు వద్ద ప్రమాదాలు అధికమయ్యాయి. బందరు జాతీయ రహదారి పూర్తయ్యాక ఈ ఒక్కచోటే 18 మంది మరణించారు. ఉయ్యూరులోకి వెళ్లే సర్వీసు దారి అలాగే ఉంది. అయిదు ప్రాంతాల్లో గుత్తేదారు పనులు అసంపూర్తిగా వదిలేశారు. భూసేకరణకు యజమాని ముందుకు రాక, న్యాయపర విషయాలు ముడిపడి ఉండటంతో పనులు వదిలేశారని అధికారులు చెప్పారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని