logo

దారి తప్పుతున్న యువత

జిల్లా వ్యాప్తంగా రూ.70 నుంచి రూ.150ల ధరతో యథేచ్ఛగా లభిస్తున్న గంజాయి సిగరెట్లు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎన్నో కుటుంబాల్లో అశాంతికి, అనర్థాలకు కారణంగా నిలుస్తున్నాయి.

Updated : 01 Jun 2023 06:08 IST

గంజాయి నిర్మూలనకు మొక్కుబడి దాడులు
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే

* బందరులోని ఈడేపల్లికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి కుమారుడు అచేతన స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. బీటెక్‌ చదివిన అతను గంజాయికి అలవాటుపడడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.


* మచిలీపట్నానికి చెందిన రైస్‌మిల్లులో పనిచేస్తున్న ఓ శ్రామికుని కుమారుడు విద్యాధికుడే అయినా గంజాయి మత్తుకు బానిసై విచిత్ర మానసిక ప్రవర్తనతో కుటుంబానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు.


* పెడనకు చెందిన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన యువకుడు గంజాయి కొనుగోలుకు డబ్బు సమకూరనప్పుడల్లా తల్లిదండ్రులను ఆత్యహత్య చేసుకుంటానని భయపెడుతున్నాడు.

ఇలా గంజాయికి బానిసైన అనేకమంది యువకులు విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.


జిల్లా వ్యాప్తంగా రూ.70 నుంచి రూ.150ల ధరతో యథేచ్ఛగా లభిస్తున్న గంజాయి సిగరెట్లు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎన్నో కుటుంబాల్లో అశాంతికి, అనర్థాలకు కారణంగా నిలుస్తున్నాయి. మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదనడానికి పై సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయాలు, వినియోగాలను అణచివేయడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. మొక్కుడిగా దాడులు చేసి  చేతులు దులుపుకుంటున్నారు. అధికారపార్టీ నాయకుల సిఫార్సులు, మామూళ్ల మత్తు మాటున మారుమూల ప్రాంతాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది.

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో మత్తులో కొందరు చేస్తున్న ఉన్మాదచర్యలు స్థానికులను కలవరపడేలా చేస్తున్నాయి. నగరంతో పాటు చల్లపల్లి, పామర్రు, గుడివాడ వంటి ప్రాంతాల్లో రహదారులు రద్దీగా ఉండే సమయంలో ఎదుటివారిని భయభ్రాంతులకు గురిచేసేలా  చేస్తున్న బైక్‌ విన్యాసాలు పరిపాటిగా మారుతున్నాయి. అదేమని ప్రశ్నించిన వారు దాడులు, అవమానాల బారిన పడాల్సి వస్తోంది. మచిలీపట్నంలోని బలరామునిపేట శ్మశానవాటిక, వనమలమ్మ, గంగానమ్మ గుడి ప్రాంతాలు, రైల్వేకాలనీ, బందరు మండల పరిధిలోని సుల్తానగరం, చల్లపల్లి శివారు ప్రాంతం, 216 జాతీయ రహదారిపై వంతెనలు, పామర్రు ఎన్టీఆర్‌ కూడలి సమీపంలోని ప్రదేశాలు, గుడివాడలో వివిధ ప్రాంతాలు గంజాయి బాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.


నాయకుల ఆశీస్సులే వారికి రక్ష

రాజకీయ పక్షాల సమావేశాలు, ర్యాలీలు ఇతరత్రా అవసరాలకు అవసరమయ్యే యువతను సమీకరించుకునే క్రమంలో కొందరు పలువురిని గంజాయి వ్యవసనానికి బానిసలుగా చేస్తున్నారు. గ్రూపులుగా తయారుచేసి వారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడంతో పాటు సులువుగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. వారే విక్రయదారులుగా మారి ఇతర ప్రాంతాలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. పట్టుబడితే తమకున్న అధికార అండతో కేసులు లేకుండా కొంత కప్పం చెల్లించి సులువుగా బయటకు వచ్చేస్తున్నారు. గత నెల ఘంటసాల మండలం పూషడం సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చేరువగా ఆటోలో తరలిస్తున్న 5 కేజీలకు పైబడిన గంజాయి పట్టుబడగా రూ.30 వేలు వెచ్చించి కేసులో ఇరుక్కోకుండా నిందితుడు మళ్లీ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గంజాయి సరఫరానే వృత్తిగా ఎంచుకున్న బందరు ఉల్లింగిపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఎన్నిసార్లు పట్టుబడినా వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నాడు. కొద్ది నెలల కిత్రం నగర శివారుప్రాంతలోని ఓ నివాసగృహం నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో పట్టుబడిన వారిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. మత్తుపదార్థాల రవాణాపై పోలీస్‌ అధికారులు స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశామని, ఎక్కడైనా వాటి ఉనికిని గుర్తించిన వారు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి తక్షణం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని