logo

పరిహారంపై దోబూచులాట!

బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో అధికారుల వైఖరి విమర్శలకు తావిస్తోంది.

Updated : 02 Jun 2023 05:15 IST

మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితుల నిర్వేదం
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో అధికారుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల కిందట నిర్వాసితులంతా పారిశ్రామికవాడ రహదారుల్ని దిగ్బంధించడంతో దిగి వచ్చిన అధికారులు 15 రోజుల్లో పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. కానీ ఏడేళ్లుగా కొలిక్కిరాని ఈ సమస్య కేవలం పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

మల్లవల్లిలో సర్వే సంఖ్య 11లో ఉన్న 1,460 ఎకరాలను 2016లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పారిశ్రామికవాడ నెలకొల్పేలా ఏపీఐఐసీకు అప్పగించింది. ఇది మొత్తం ప్రభుత్వ భూమే అయినా  రైతుల సాగులో ఉండటంతో ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి భూ సేకరణ జరిపారు. మొత్తం 490 మంది, 716.44 ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేస్తున్నట్లు నిర్ధారించి, ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున రూ.53.73 కోట్లు పరిహారం చెల్లించేందుకు 2016లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. జాబితాలో అనర్హులు చోటుచేసుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వడపోత చేపట్టి చివరకు 443 మందికి 615.6 ఎకరాలకు రూ.46.17 కోట్లు చెల్లించారు. దీంతో పాటు గ్రామంలో ఉన్న 1,612 తెల్లకార్డులకు 1,228 మందికి రూ.50 వేలు చొప్పున రూ.61.40 లక్షలు చెల్లించారు.

అర్హుల ఎంపికపై సందిగ్ధం  

వివిధ కారణాలతో అధికారులు పక్కనబెట్టినప్పటికీ అర్హులై ఉండి పరిహారం రావాల్సి వారు 50 మందికి పైగా ఉంటారని అప్పట్లోనే అంచనా వేశారు. ఆ సంఖ్య గత ఏడేళ్లుగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం పారిశ్రామికవాడలో ఆందోళన చేస్తున్న రైతుల లెక్కల ప్రకారం 118 మందికి 99.17 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందని చెబుతుండగా.. ఈ ఏడాది జనవరిలో గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో స్వీకరించిన అర్జీల ప్రకారం 247 మందికి 713 ఎకరాలకు పరిహారం ఇవ్వాలని అర్జీలు సమర్పించారు. దీంతో పాటు 2016లో కొత్తగా రేషన్‌కార్డులు మంజూరైన వారికి కూడా రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్పష్టత కరవు

గతేడాది ఎమ్మెల్యే వంశీ సీఎంను కలిసి నియోజకవర్గానికి సంబంధించి పరిష్కారం చేయాల్సిన అంశాల్లో మల్లవల్లి నిర్వాసితుల పరిహారం విషయం కూడా ఉంది. కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు నూజివీడు ఆర్డీవోలుగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు ఎవరికీ పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా నివేదికలు సమర్పించారు. కానీ ఆ తర్వాత కూడా అర్జీల స్వీకరణలు, క్షేత్ర విచారణలు నిర్వహించడంతో నిర్వాసితులు పరిహారం వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు.


ప్రాణాలు తీసుకోబోయినా ఫలితం లేదు

  - పంతం కామరాజు

పరిహారం చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం నిర్వహించిన జియోకాన్‌ సర్వేలో నాకు వ్యక్తిగతంగా 4.50 ఎకరాలు ఉన్నట్లు తేలింది. కానీ అర్హుల జాబితాలో నా పేరు రాలేదు. ఇదేమని అడిగితే అధికారులు స్పందించలేదు. అప్పట్నుంచి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నా. ఈ వేదనతోనే అనారోగ్యం కూడా వచ్చేసింది. రెండుసార్లు పోలీసుల సమక్షంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నా.


స్థానికులం కాదని ఇవ్వలేదు  

- దోనవల్లి వెంకట్రావు

మా కుటుంబం ఆధీనంలో ఎప్పట్నుంచో దాదాపు పదెకరాల పొలం సాగులో ఉంది. జియోకాన్‌ సర్వే సమయంలో అధికారులు దీనిని గుర్తించినా, పరిహారం ఇచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. అదేమంటూ స్థానికులు కాదంటున్నారు. పక్కనే ఉన్న మర్రిబంధం, పోలసానపల్లి గ్రామాల్లో ఉండి ఈ భూములు సాగు చేసుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని