logo

మెట్రోమాయం.. మానని గాయం..!

ఆయనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు.

Updated : 02 Jun 2023 05:18 IST

భూసేకరణ పేరుతో  దగా..!
నాలుగేళ్లుగా భూములన్నీ నిషేధంలోనే..
మార్కెట్‌ విలువ పతనంతో రూ.కోట్లలో నష్టం
ఈనాడు, అమరావతి

మెట్రో నిర్మాణానికి భూసేకరణ పేరుతో మార్కెట్‌ విలువ గణనీయంగా పడిపోయింది. ఆయా సర్వే నెంబర్లలో క్రయ విక్రయాలపై నిషేధం విధించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జాబితా వెళ్లింది.

* ఆరేళ్లుగా ఇది నలిగింది. ప్రభుత్వం మారాక దీనిపై ఆశలు సన్నగిల్లాయి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఆపేయడం, పలు సంస్థలు తరలిపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అదే తీరు బందరు, ఏలూరు రహదారి వెంట స్థలాలపై కూడా ప్రభావం చూపింది. ఇన్నేళ్లు నిషేధంలో ఉంచి ఇప్పుడు నోటిఫికేషన్‌ ఉపసంహరణతో రైతులు తల్లడిల్లుతున్నారు.

* పలువురు రూ.కోట్లలో నష్టపోతున్నారు. ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద కూడా నిడమానూరు రైతులు భూములు ఇచ్చారు. వాటిని నాడు విక్రయించేందుకు వీలు లేదని రెవెన్యూ శాఖ అడ్డుపడింది. ప్రస్తుతం విలువలు దిగజారడంతో వాపోతున్నారు.

యనకు ఎనికేపాడులో ఓ ఇంటి స్థలం ఉంది. కుటుంబ అవసరాల కోసం అమ్మకానికి పెట్టారు. మెట్రోకు భూసేకరణ చేస్తున్నారనీ.. దానికి తీసుకుంటారని ప్రచారం జరగడంతో కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. 2016లో ప్రాథమిక సర్వేలో ఆయన నివాస స్థలం 445 గజాలు సేకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. 2017లో తుది నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2016లో అక్కడ గజం.. సుమారు 1.5 లక్షలు పలికింది. భూసేకరణలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం పరిహారం అందుతుందని భావించారు. తర్వాత పరిణామాల్లో మరుగున పడింది. ప్రస్తుతం అదే స్థలం గజం రూ.80 వేలు నుంచి రూ.లక్ష వరకే మార్కెట్‌ విలువ ఉంది. డిమాండ్‌ తక్కువగా ఉంది. దాదాపు ఏడేళ్లు గడిచాయి. స్థలం విలువ భారీగా తగ్గి తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మెట్రో భూసేకరణను ఉపసంహరిస్తూ.. నోటిఫికేషన్‌ ఇచ్చారు. వెరసి గజానికి రూ.70 వేలు చొప్పున 445 గజాల స్థలంలో రూ.3.12 కోట్లు నష్టం. పైగా ఏడేళ్లు కరిగిపోయింది. దీనికి వడ్డీ నష్టం. ఇదీ మెట్రోకు ఈ ప్రభుత్వం ఉరేసిన తీరుతో జరిగిన నష్టం.

నిడమానూరులో మెట్రో రైల్‌ కోచ్‌ మార్పిడి స్టేషన్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. అప్పటికే అక్కడ ఎకరం రూ.20 కోట్లు పలుకుతోంది. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం రూ.50 లక్షలకే సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతులు తాము ఇవ్వబోమని అడ్డం తిరిగారు. మెట్రో భూసేకరణ నోటిఫికేషన్‌తో అమ్మకాలు నిలిచిపోయాయి. తాజాగా నిడమానూరు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. ప్రస్తుతం అక్కడ భూములు అడిగే వారే లేరు. ఎకరం రూ.20 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పడిపోయింది. సగానికి సగం నష్టం. నాడు అమ్ముకోనీయలేదు.. పరిహారం ఇవ్వలేదు.. మెట్రో పేరుతో దారుణంగా మోసం చేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మారకపోతే.. మెట్రో పట్టా లెక్కేదని తమ భూములకు పరిహారం అందేదని రైతులు భావిస్తున్నారు.


దశల వారీగా ఉపసంహరణ..!

విజయవాడ మెట్రో రైలు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను దశలవారీగా ఉపసంహరించేందుకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డీఎన్‌డీడీ (డ్రాప్టు నోటిఫికేషన్‌, డ్రాప్టు డిక్లరేషన్‌) జారీ చేసి దాదాపు నాలుగేళ్లు పైగా గడువు కావడంతో కాలపరిమితి ముగిసిందనే నెపంతో భూసేకరణ నోటిఫికేషన్‌లను రెవెన్యూ శాఖ ఉపసంహరిస్తోంది. సాధారణంగా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ ఇక మెట్రో ఇప్పట్లో ఉండబోదని నిర్ధారణకు రావడంతోనే ఉపసంహరణ నోటిపికేషన్‌ గెజిట్‌లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జారీ చేస్తున్నారు. అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం రెవెన్యూ గ్రామాల వారీగా ఉపసంహరణ నోటిఫికేషన్‌లు ఇస్తారని తెలిసింది.


భారీ అంచనాలతో అడుగులు...

మొదట డీఎంఆర్‌సీ ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం విజయవాడ మెట్రో రెండు కారిడార్లు నిర్మించాలి. వీటి దూరం 26 కిలోమీటర్లు. ఏలూరు కారిడార్‌ పీఎన్‌బీఎస్‌ నుంచి నిడమానూరు వరకు, బందరు కారిడార్‌ పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు ఉండేది. ఏలూరు కారిడార్‌ను గన్నవరం వరకు పొడిగించారు. ఇది మొత్తం 38.4 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.9,078 కోట్లు. కిలోమీటరు వ్యయం రూ.236 కోట్లు. దీనిలో గన్నవరం కారిడార్‌ దూరం 26 కిలోమీటర్లు. పెనమలూరు దూరం 12.5 కిలోమీటర్లు.

* గన్నవరం కారిడార్‌కు 85.56 ఎకరాలు, పెనమలూరుకు 5.97 ఎకరాలు అవసరం. అయితే పీఎన్‌బీఎస్‌ నుంచి నిడమానూరు వరకే నోటిఫికేషన్‌ జారీ చేశారు. బందరు రోడ్డులో పెనమలూరు వరకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎలివేటెడ్‌ కారిడార్‌కు కి.మీ.కి రూ.230 కోట్లు వ్యయం అంచనా వేశారు.

* రెండు కారిడార్లకు సుమారు రూ.300 కోట్ల వరకు భూసేకరణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. భవనాలు ఇతర కట్టడాలు కూడా కొన్ని సేకరించాలని అంచనా. అన్ని ప్రాంతాల్లోనూ పెగ్‌ మార్కింగ్‌ ఇచ్చారు. ఎర్రరంగుతో నిర్మాణాలకు సర్వే సిబ్బంది మార్కింగ్‌ ఇవ్వడం విశేషం.


ప్రతిపాదనలు అందగానే...

విజయవాడ గ్రామీణ మండలంలో, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు మండలాల పరిధిలో భూసేకరణ ప్రతిపాదనలు ఉన్న వాటిని దశల వారీగా ఉపసంహరించనున్నారు. నాడు మెట్రోకు భూసేకరణ అధికారిగా విజయవాడ రెవెన్యూ డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ వ్యవహరించారు. తాజాగా సబ్‌ కలెక్టర్‌ నుంచే ప్రతిపాదనలు అందాలి. వి కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు పంచాయతీల్లో భూసేకరణ నాడు విజయవాడ డివిజన్‌ పరిధిలో ఉండేవి. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌, కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఉయ్యూరు ఆర్డీవో నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. వీటిని త్వరలో ఉపసంహరిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీని పరిధిలో సుమారు 5 ఎకరాల వరకు ఉంది. వి అవసరమైతే మరోసారి సేకరణకు ప్రతిపాదనలు తీసుకుంటామని ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగేళ్ల గడువుతో కాలపరిమితి ముగియడంతో ఉపసంహరిస్తున్నట్లు ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని