logo

కోరుకొన్నట్లే.. కొలువు!

రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు.

Published : 02 Jun 2023 04:14 IST

దేవాదాయ శాఖలో పైరవీలకే పెద్దపీట
ఈనాడు, అమరావతి

రాజకీయ పలుకుబడి, ఉత్తరంతోపాటు... దక్షిణ సమర్పించుకున్న వారికి కోరుకున్న స్థానం దక్కింది. నిబంధనలు, మార్గదర్శకాలు బేఖాతరు. ఎవరికి ఇష్టమైన వారిని వారు బదిలీ చేయించుకున్నారు. కోరుకున్న పోస్టు దక్కించుకున్నారు. అర్హులు ఉన్నా.. వారిని కాదని రెండు జిల్లాలకు ఒకే అధికారిని నియమించడం, రెండు దేవాలయాలకు ఒకే అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించడం జరిగాయి. ఇటీవల బదిలీ జరిగి... మార్గదర్శకాల ప్రకారం కాలపరిమితి లేకపోయినా బదిలీ చేశారు. జోనల్‌ పరిధి దాటి కొంతమందిని బదిలీ చేశారు. కోరుకున్న పోస్టులు దక్కించుకున్నారు. పోస్టుల కోసం రూ.లక్షల్లో సమర్పించుకున్నట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. తమకు స్థానం ఇస్తామని నమ్మబలికిన రాజకీయ నాయకులు వేరే వారు బరువు పెంచడంతో వారికి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దేవదాయ శాఖలో గురువారం పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరిగాయి. అన్నీ గందరగోళంగా జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో నిబంధనల కన్నా.. వినతుల కన్నా.. రాజకీయ పలుకుబడికే ప్రాధాన్యం ఇచ్చారు.


ఆరు నెలలైనా కాకుండానే...

కనీసం రెండేళ్లు దాటితేనే రిక్వెస్టు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. కానీ కనీసం ఆరునెలలు గడువు కూడా లేకుండానే బదిలీ చేశారు. ఒకే అధికారికి రెండు పోస్టులు ఇవ్వడానికి అవకాశం లేదు. సీఎంవోలో ఓ అధికారి పైరవీతో కల్పించారనే విమర్శలు ఉన్నాయి. కృష్ణాజిల్లా దేవదాయశాఖ అధికారి (సహాయ కమిషనరు) జిల్లాకు వచ్చి ఆరు నెలలుకూడా కాలేదు. తిరిగి ఆయనను డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ దేవాలయానికి బదిలీ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం నెమలి వేణుగోపాల స్వామి ఈవోగా ఉన్న, సహాయ కమిషనర్‌ హోదా ఉన్న శాంతిని తిరిగి ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అధికారిగా నియమించారు. ఆమెను కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా కూడా నియమిస్తూ.. పూర్తి అదనపు బాధ్యతలు కల్పించారు. గతంలో ఎన్టీఆర్‌ జిల్లా అధికారిగా పని చేసిన శాంతి ఆరునెలల కిందటే నెమలికి బదిలీ అయ్యారు. అక్కడ మెటర్నిటీ సెలవులో ఉన్నారు. కేవలం మూడు నెలల సెలవు తర్వాత తిరిగి ఇప్పుడు బదిలీ అయ్యారు. రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.

అంతకు ముందు ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అధికారిగా (ఏసీ) ఉన్న శాంతి స్థానంలోకి అన్నపూర్ణ రాగా బాధ్యతలు అప్పగించేందుకు ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా అధికారిగా (ఏసీ) ఉన్న అన్నపూర్ణను నూకాలమ్మ దేవాలయం విశాఖకు బదిలీ చేశారు. ఆమె శ్రీకాకుళంలో నాలుగేళ్లుగా పనిచేస్తుంటే అక్కడి రాజకీయ నాయకులతో పొసగక ఎన్టీఆర్‌ జిల్లాకు పంపారు. దస్త్రాల్లో డిప్యుటేషన్‌ చూపించి తాజాగా విశాఖకు బదిలీ చేశారు.

కృష్ణా జిల్లా అధికారిగా సాయిబాబు (ఏసీ) ఇటీవల మచిలీపట్నంలో బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు హరిగోపీనాథ్‌ జిల్లా అధికారిగా ఇన్‌ఛార్జి హోదాలో ఉండేవారు. ఆయనను తప్పించి సాయిబాబును నియమించారు. ప్రస్తుతం ఆయనను బదిలీ చేసి శాంతికి అదనపు బాధ్యతలు ఇవ్వడం విశేషం.

వేంకటేశ్వరస్వామి దేవాలయం ఈవోగా ఉండే హరిగోపీనాథ్‌ అయిదేళ్లుగా ఒకే స్థానంలో ఉన్నారు. ఆయనకు బదిలీ జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని