logo

నకిలీ పత్రాలతో స్వాహా

గుడివాడకు చెందిన అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. జాగా కనిపిస్తే చాలు పాగే వేసేందుకు అడ్డదారులు తొక్కుతూ ఆక్రమణలకు తెగబడుతున్నారు.

Published : 02 Jun 2023 04:14 IST

రైల్వే స్థలాలనూ వదలని అధికార పార్టీ నాయకులు
న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం

గుడివాడకు చెందిన అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. జాగా కనిపిస్తే చాలు పాగే వేసేందుకు అడ్డదారులు తొక్కుతూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. తాత ముత్తాతల నుంచి సంక్రమించినా.. కష్టార్జితంగా సంపాదించినా.. ప్రభుత్వ పోరంబోకు, చివరకు రైల్వే ఆస్థులైనా గానీ ఏమాత్రం వెరవకుండా నకిలీ పత్రాలతో కొందరు అక్రమార్కులు కాజేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకొని అడ్డగోలు పనులకు తెరతీస్తున్నారు. తాజాగా రైల్వే లైన్లను సైతం సొంత ఆస్థులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని ఆర్‌ఎస్‌ నెంబర్‌ 448/2లోని 69 సెంట్ల స్థలాన్ని నందివాడ మండలానికి చెందిన వైకాపా నాయకుడు, గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్‌ మండ్రు సనీత భర్త మండ్రు వెంకటేశ్వరరావు తమను మోసం చేసి ఆయన కుమార్తె పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అదే మండలానికి చెందిన కాకరాల రవిశంకర్‌, కాకరాల వెంకట్రామయ్య కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంక కదిలింది. 2013-14లో విజయవాడ - భీమవరం రైల్వే లైన్ల డబ్లింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ మేరకు రైల్వే శాఖ భూసేకరణ చేసింది. ఆ సమయంలో రైల్వే వారు 448/2 ఏలో సుమారు 8 సెంట్ల భూమిని సేకరించారు. దీనికి సంబంధించిన నష్టపరిహారం కూడా కాకరాల సోదరుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలో వారి స్థలంలో 61 సెంట్లు మాత్రమే మిగిలి ఉంది. అయితే కాకరాల సోదరులు తమను మోసం చేశారని చెబుతున్న మండ్రు వెంకటేశ్వరరావు రైల్వే వారికి ఇచ్చిన 8 సెంట్లను కూడా రిజిస్ట్రేషన్‌ చేయించడం వల్ల అధికారుల విచారణలో ఇది బయట పడింది.


అక్రమంగా 8 సెంట్లు రిజిస్ట్రేషన్‌

రైల్వే స్థలం ఆక్రమణ విషయం గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. గురువారం మిట్ట మధ్యాహ్నం మండుటెండలో సిబ్బంది వచ్చి ఆర్‌ఎస్‌ నెంబర్‌ 448/2ఎలో కొలతలు వేశారు. గుడివాడ రైవ్వే అసిస్టెంట్‌ పర్మనెంట్‌ వే ఇన్‌స్పెక్టర్‌ (ఏపీడబ్ల్యూఐ) ఎ.ధర్మారావు సిబ్బందితో కొలతలు తీయించి అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడి పరిస్థితులు వివరించారు. రైల్వే లైన్ల డబ్లింగ్‌ కోసం రైల్వే శాఖ ఆర్‌ఎస్‌ నెంబర్‌ 448/1ఏలో 14 సెంట్లు, 448/2ఏలో 8 సెంట్లు భూసేకరణ చేసినట్లు తెలిపారు. అంటే ఆర్‌ఎస్‌ నెంబర్‌ 448/2ఏలోని రైల్వే వారు సేకరించిన 8 సెంట్లతోసహా 69 సెంట్లు వైకాపా నాయకుడు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం రైల్వే స్థలానికి మరోసారి సర్వే చేయించి అక్రమార్కులపై చర్యలకు ఆదేశించే ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి తహసీల్దారు కె.ఆంజనేయులు వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా ఈ విషయంపై తనకు ఎలాటి సమాచారం లేదని.. వీఆర్వో, ఆర్‌ఐలతో చరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


ఆన్‌లైన్‌ చేస్తే ఇది జరిగేది కాదు

రైల్వే భూసేకరణ చేసిన వివరాలను రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేసినా.. లేదా సంబంధిత పత్రాలను సబ్‌రిజిస్ట్రార్‌ వారి కార్యాలయానికి సమర్పించినా ఈ తప్పిదం జరిగేది కాదని గుడివాడ సబ్‌ రిజిస్ట్రార్‌ సీతారామాంజనేయులు తెలిపారు. 2013 నుంచి నేటి వరకూ అది పట్టా భూమిగానే రికార్డుల్లో ఉండడం వల్ల మండ్రు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్‌ చేయించగలిగారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు