logo

పర్యాటకం కళావిహీనం

వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది.

Updated : 02 Jun 2023 04:21 IST

నిలిచిన అభివృద్ధి పనులు
నాలుగేళ్లుగా దృష్టి పెట్టని వైనం
భవానీపురం, న్యూస్‌టుడే

వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పరిధిలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అటకెక్కింది. నాలుగేళ్లుగా ఆయా ప్రదేశాల అభివృద్ధిలో ఎటువంటి పురోగతి లేదు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆయా ప్రదేశాలు పర్యాటకులు, సందర్శకులతో కళకళలాడేందుకు వీలుంటుంది.

ఊసేలేని రోప్‌వే

కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన ద్వీపం అభివృద్ధి నాలుగేళ్లుగా నిలిచిపోయింది. అడపాదడపా పండగల సమయంలో ఈవెంట్లు నిర్వహిస్తూ అధికారులు మమ అనిపిస్తున్నారు. నది ఒడ్డున లేజర్‌షో, వాటర్‌ ఫౌంటేన్‌ను గత ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. వరదల కారణంగా ఈ ఫౌంటేన్‌, లేజర్‌షో దెబ్బతిన్నాయి. గుత్తేదారు మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. దీంతో కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ద్వీపం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌(బీఐటీసీ)ను ఏర్పాటు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.

రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల వద్ద 25 పైగా రోప్‌వేల నిర్మాణానికి ఏపీ పర్యాటక శాఖ సంకల్పించింది. అందులో మొదటి విడతగా కృష్ణానదిపై భవానీ ద్వీపానికి రోప్‌వే నిర్మాణానికి నిర్ణయించారు. కనకదుర్గ గుడి వద్ద నుంచి రోప్‌వేను నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత పున్నమిఘాట్‌ వద్ద నుంచి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రకారం డీపీఆర్‌ తయారు చేయిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా అమలు కాలేదు. రోప్‌ వే నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి కొత్తరూపు వచ్చే అవకాశం ఉంటుంది.


దాత ఆశయానికి తూట్లు..

బుద్ధుడికి సంబంధించిన ఆనవాళ్లు కృష్ణాజిల్లా ఘంటసాలలో ఉన్నాయి. అమరావతిలో బుద్ధుడు కూర్చుని ఉండగా ఘంటసాలలో శయనిస్తూ ఉండే విగ్రహ నిర్మాణానికి నిర్ణయించారు. 100 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో విగ్రహం నిర్మించేందుకు సంకల్పించారు. అందుకు ప్రవాసాంధ్రుడు తన సొంత స్థలాన్ని ఉచితంగా అందించారు. ఏడేళ్ల కిందట ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండు అంతస్థులకు సంబంధించిన శ్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. బుద్ధుడి విగ్రహం, ఇతర నిర్మాణాలు చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాత ఆశయానికి తూట్లు పడినట్లయింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు వీలుంది.


మంగినపూడి బీచ్‌ పరిస్థితి ఇలా..

చిలీపట్నంలో మంగినపూడి బీచ్‌ ఉంది. అక్కడకు నిత్యం విజయవాడ నగరం నుంచి ఎంతో మంది వెళ్తుంటారు. ఆ బీచ్‌ ఒడ్డున కాటేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అక్కడ కనీస వసతులు కరవయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.5కోట్ల వ్యయంతో బీచ్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో సీతాకోక చిలుకల ఉద్యానవనం, అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌, చల్లపల్లిలో కోట, నగరానికి సమీపంలోని ఉండవల్లి గుహలు, గాంధీ కొండ, కొండపల్లి కోట ఇలా... పలు పర్యాటక, సందర్శనీయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు వీలున్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి అభివృద్ధి చేస్తే పర్యాటకరంగం పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. కొండపల్లి కోటకు సందర్శకులు వెళ్లేలా పర్యాటక బస్సులు, ఆర్టీసీ బస్సులను నడుపుతామని ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని