logo

1,27,954 మంది రైతులకు లబ్ధి

వై.ఎస్‌.ఆర్‌. రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద జిల్లాలో మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 02 Jun 2023 04:14 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వై.ఎస్‌.ఆర్‌. రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద జిల్లాలో మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. వీరిలో 1,27,739 మంది రైతులు సొంత భూములను కలిగి ఉండగా రూ.95,80,43,000లు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న 215 మందికి రూ.1,61,25,000లు అందిస్తున్నట్టు వివరించారు. గురువారం రైతు భరోసా నిధుల జమ జిల్లా కార్యక్రమాన్ని విజయవాడలోని జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నాలుగు విడతలుగా రైతు భరోసా కింద రూ.7,500లు, పీఎం కిసాన్‌ పథకం కింద రూ.6,000లను ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 5 విడతలుగా 1,34,338 మంది రైతులకు రూ.748.43 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టు అవుతుందని తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇటీవల కురిసన అకాల వర్షాలకు జిల్లాలో మొక్కజొన్న, జొన్న, వరి, మినుము, నువ్వులు, పెసర వంటి పంటలు 1070.41 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు. 1610 మంది రైతులకు రూ.1,36,10,000 లను పెట్టుబడి రాయితీ, నష్ట పరిహారంగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్లు ఛైర్మన్లు తోలేటి శ్రీకాంత్‌, శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారిణి ఎస్‌.నాగమణి, జిల్లా ఉద్యాన శాఖాధికారి కె.బాలాజీ కుమార్‌, ఏపీఎంఐపీ డీడీ షేక్‌ సుభానీ, వ్యవసాయాధికారులు రత్నశ్రీ, స్వప్న, ఊర్మిళ, అనితా భాను, రైతులు పాల్గొన్నారు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయల స్టాళ్లను కలెక్టర్‌ తదితరులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని