logo

కొత్త రైళ్లు నడపొచ్చిక

 విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆరంభానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టారు.

Published : 03 Jun 2023 03:52 IST

రూ.100 కోట్లతో పిట్‌,స్టేబులింగ్‌ లైన్లు
విజయవాడ స్టేషన్‌కు అనుబంధంగా నిర్మాణం

ఈనాడు, అమరావతి:  విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆరంభానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. ఈమేరకు రూ.100 కోట్లతో విజయవాడలోని పాలఫ్యాక్టరీ సమీపంలో కొత్తగా రెండు పిట్‌ లైన్లు, ఒక స్టేబులింగ్‌ లైన్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. రైళ్ల రోజువారీ నిర్వహణ, సామర్థ్యం పర్యవేక్షణ, మరమ్మతులు చేసేందుకు పిట్‌, స్టేబులింగ్‌ లైన్లే కీలకం. ఇవి ఎక్కువ లేకనే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఇతర నగరాలకు కొత్త రైళ్లను ఆరంభించేందుకు ఇన్నాళ్లూ అవకాశం లేకపోయింది.
రాష్ట్రంలోనే కీలకమైన విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా రోజు 200కు పైగా రైళ్లు... లక్ష మందిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ.. ఇక్కడి నుంచి నిత్యం బయలుదేరి ఇతర నగరాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కేవలం అయిదే ఉన్నాయి. విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండడంతో కొత్త రైళ్లను ఆరంభించమని చాన్నాళ్లుగా వినతులు వస్తున్నాయి. కానీ.. రైళ్ల రోజువారీ నిర్వహణను చేపట్టే పిట్‌ లైన్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి. విజయవాడ యార్డులో వేగన్‌ డిపో దగ్గర ఐదు పిట్‌లైన్లు, ఒక స్టేబులింగ్‌ లైన్‌ మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒక్కో పిట్‌, స్టేబులింగ్‌ లైన్‌లో రోజుకు నాలుగు రైళ్ల నిర్వహణను మాత్రమే చూసే వీలుంది. ఒక్కో రైలును పూర్తిగా పరీక్షించేందుకు కనీసం ఆరు గంటలు పిట్‌ లైన్‌లో ఉంచాలి. ఈ లెక్కన ఆరింటిలో కలిపినా 24 రైళ్లను మాత్రమే ఒక రోజుకు పరీక్షించే వీలుంది.


మూడో లైన్‌ అందుబాటులోకి వస్తే...

కాజీపేట-విజయవాడ మూడో లైన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే.. రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పిట్‌, స్టేబులింగ్‌ లైన్ల సామర్థ్యం ఏమాత్రం చాలదు. అందుకే.. తాజాగా రూ.100 కోట్లను ఈ మూడో లైన్‌ పనుల్లో భాగంగానే విజయవాడకు మంజూరు చేశారు. వాటితో పాలఫ్యాక్టరీ దగ్గర రైల్వే ఖాళీ స్థలంలో రెండు పిట్‌, ఒక స్టేబులింగ్‌ లైన్‌ నిర్మిస్తున్నారు. 26 కోచ్‌లను నిలిపేలా పిట్‌ లైన్లను నిర్మిస్తున్నారు. దీనిలో ఇంజిన్‌ను పూర్తిగా పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ పిట్‌లైన్‌లోకి రైలు వచ్చాక.. కింది వైపు, పక్కన కలిపి పూర్తిగా పరిశీలించి, మరమ్మతులు, నిర్వహణ చేసేలా అధునాతనంగా కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగించే రైళ్లకు బ్రేక్‌, ఇంజిన్‌ ప్రెజర్‌, నీటి సౌకర్యానికి పిట్‌, స్టేబులింగ్‌ లైన్లు కీలకంగా మారనున్నాయి. అన్ని సీజన్లలోనూ ఇక్కడ సేవలు అందించేలా పూర్తిగా పైకప్పు, అధునాతన లైటింగ్‌ వ్యవస్థతో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.


కేవలం ఐదే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు...

విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆరంభమై కేవలం ఉదయం రెండు, రాత్రి మూడు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. మిగతా రైళ్లన్నీ ఇతర నగరాల నుంచి వచ్చి విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లేవే. పినాకిని (చెన్నై), విక్రమ సింహపురి(గూడురు), ఎంప్లాయీస్‌ స్పెషల్‌ (లింగంపల్లి), రత్నాచల్‌ (విశాఖ), శాతవాహన (సికింద్రాబాద్‌).. ఈ ఐదు రైళ్లే విజయవాడ నుంచి బయలుదేరి ఇతర నగరాలకు నడుస్తున్నాయి. వారానికోసారి విజయవాడ నుంచి షిర్డీ వెళ్లే రైలును త్వరలో నర్సాపూర్‌కు మారుస్తున్నారు. విజయవాడ-ధర్మవరం మధ్య రైలును మచిలీపట్నానికి మార్చారు. వందేభారత్‌ రైలును విజయవాడ నుంచి ఆరంభించేలా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో పిట్‌ లైన్ల సామర్థ్యం కచ్చితంగా పెంచాలి. కొత్తగా వచ్చే రెండు పిట్‌లైన్లతో కలిపితే ఏడుకు.. స్టేబులింగ్‌ లైన్ల సంఖ్య రెండుకు పెరిగి.. స్టేషన్‌ నుంచి రైళ్లను కొత్తగా ఏర్పాటు చేసే వీలుంటుంది.


విజయవాడ నుంచి బయలుదేరే వాటికి...

పాల ఫ్యాక్టరీ దగ్గర రైళ్ల నిర్వహణ కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పిట్‌ లైన్‌

విజయవాడ సహా ఏ రైల్వేస్టేషన్‌ నుంచి అయినా బయలుదేరే రైళ్లను తిరిగి అక్కడికే తీసుకొచ్చి ప్రధానమైన నిర్వహణ (ప్రైమరీ మెయింటెనెన్స్‌) చేస్తారు. విజయవాడ నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నైకు వెళితే.. అక్కడ సాధారణ నిర్వహణ (అదర్‌ ఎండ్‌ మెయింటెనెన్స్‌) మాత్రమే చేసి పంపిస్తారు. నీటిని నింపడం, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని మాత్రమే చెన్నైలో చక్కదిద్దుతారు. తిరిగి రైలు విజయవాడకు వచ్చాకే.. ఇక్కడ పిట్‌ లైన్‌లోకి పంపి పూర్తిగా ఇంజిన్‌, బోగీలు, బ్రేక్‌ సహా ఇతరాలు పరీక్షించి ఏ లోపమున్నా సరిచేస్తారు. అందుకే కొత్త ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల ఏర్పాటుకు పూర్తిస్థాయిలో నిర్వహణకు అవసరమైన పిట్‌ లైన్లు ఎక్కువ ఉండాలి. పైగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో ఆగిపోయినా.. ఇక్కడికే తీసుకొస్తుండడంతో ప్రస్తుతం ఉన్న ఆరు లైన్లు చాలడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని