logo

జర భద్రం!

హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఉదయలక్ష్మి అనే మహిళ కుమారుడి స్కూటీపై ఎక్కి విజయవాడ వెళ్లి, వస్తుండగా బాపులపాడు మండలం వీరవల్లి వద్దకు చేరుకునేసరికి టైరు అకస్మాత్తుగా పేలడంతో కిందపడిపోయి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Published : 03 Jun 2023 03:52 IST

తరచూ పేలుతున్న టైర్లు
అప్రమత్తతే కీలకమంటున్న నిపుణులు

టైరు పేలి డివైడర్‌ పైకి దూసుకుపోయిన కారు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 8: హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఉదయలక్ష్మి అనే మహిళ కుమారుడి స్కూటీపై ఎక్కి విజయవాడ వెళ్లి, వస్తుండగా బాపులపాడు మండలం వీరవల్లి వద్దకు చేరుకునేసరికి టైరు అకస్మాత్తుగా పేలడంతో కిందపడిపోయి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనం నడుపుతున్న ఫణితేజకు స్వల్ప గాయాలయ్యాయి.


మార్చి 3: విజయవాడకు చెందిన దుర్గారావు, జగదీష్‌లు గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ వారు ద్విచక్ర వాహనంపై రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడ నుంచి వస్తూ శేరీనరసన్నపాలెం వద్ద వెనక టైరు పేలడంతో ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలయ్యాయి.


మే 15: ఏలూరుకు చెందిన దేవిరెడ్డి కృష్ణకౌశిక్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో కోటప్పకొండ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వీరవల్లి వద్ద కారు టైరు పేలింది. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి, డివైడర్‌ను దాటుకుని అవతలి వైపునకు దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా ఎలాంటి భారీ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.


* ఈ మూడు ఘటనల్ని పరిశీలిస్తే వాహనం ఏదైనా టైరు పేలడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు టైర్ల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని పోలీసులు, నిపుణులు చెబుతున్నారు. వాహనాలు నడవడంలో ఇంజిన్‌ తర్వాత కీలక పాత్ర పోషించేవి టైర్లే అయినా, చాలామంది వీటి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం అనర్థాలకు దారితీస్తోంది.
ప్రణాళిక అవసరం: విక్రయించే సమయంలోనే వాహనాన్ని బట్టి వాటి టైర్ల మన్నిక, ఎప్పుడు మార్చుకోవాలనేది కంపెనీలు స్పష్టంగా సూచిస్తున్నాయి. కొంచెం అటు, ఇటుగానైనా ఆ సూచనల్ని వాహనదారులు పాటించాలి. ఉదాహరణకు ద్విచక్ర వాహనాలైతే 6-12 నెలలు గానీ 15-20 వేల కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత, కార్లయితే 12-18 నెలల మధ్య కాలంలో 20-25 వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తప్పనిసరిగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వాహనదార్లు ఇంకా టైర్లు అరిగినట్లు లేవు.. కొంతకాలం నడిపేయొచ్చు అన్న ధోరణిలో అలసత్వం వహించకూడదు.
‘గాలి’ ముఖ్యం: వాహనాల టైర్ల మన్నిక వాటిల్లో గాలి సక్రమంగా ఉండేలా జాగ్రత్త వహించడంపైనే ఆధారపడి ఉంటుంది. గాలి ఎక్కవైనా, తక్కువైనా అరుగుదలలో తేడా వస్తుంది. ఎగుడు దిగుడుగా అరగడం వలన టైర్లకు ఉన్న సహజ సిద్ధమైన గ్రిప్‌ తొందరగా తగ్గిపోతుంది. ఈ కారణంగానే వేగంగా వెళ్లే సమయంలో బ్రేకులు వేసినా బండి ఆగకుండా జారుతూ వెళ్లడం, పేలిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.


జాగ్రత్తగా ఉండాలి

ఇటీవల కాలంలో 16వ జాతీయ రహదారిపై టైర్లు పేలిపోవడం వల్లే వరుస ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో కొందరు మరణించగా, అనేక మంది గాయాల పాలయ్యారు. ఎక్కువ శాతం వాహనదారులు తమ వాహనాలకు ఉన్న టైర్ల నిర్వహణ సరిగా పట్టించుకోకపోవడం, ఎండ తీవ్రత వలన జరిగినట్లు గుర్తించాం. చాలా మంది రహదారులపై వేగంగా దూసుకుపోవడానికి ప్రాధాన్యం ఇస్తూ, కీలకమైన టైర్ల తీరు గురించి పట్టించుకోవడం లేదు. చోదకులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి.

నవీన్‌ నరసింహమూర్తి, సీఐ, హనుమాన్‌జంక్షన్‌


శ్రద్ధ వహించాలి

వాహనం ఏదైనా యజమానులు, నడిపేవారు తప్పనిసరిగా టైర్లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. గాలి తనిఖీ చేసుకోవడం, అరుగుదల తీరుని గమనించడం కీలకం. మనం తిరిగే దూరంతో పాటు, టైర్లు అమర్చిన తర్వాత గడిచిన కాలాన్ని బట్టి తప్పనిసరిగా టైర్లు మార్చుకోవాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అశ్రద్ధ వహిస్తే, ప్రాణాలకు ముప్పు వస్తుందన్న విషయం గ్రహించాలి.   

నాగేశ్వరరావు, టైర్ల నిపుణుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని