logo

ఆ నాలుగు మండలాల్లో బాల్య వివాహాలు ఎక్కువ

పేదరికం, నిరక్షరాస్యత.. బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయని, బాల్య వివాహ చట్టంపై గ్రామ స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 03:52 IST

ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు, ప్రతినిధులు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌: పేదరికం, నిరక్షరాస్యత.. బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయని, బాల్య వివాహ చట్టంపై గ్రామ స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం మండలాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోందన్నారు. బాల్య వివాహం జరిగితే సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసి, శిక్ష పడేలా చేయగలిగితే భయపడే పరిస్థితి వస్తుందన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపులు, చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై.. నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం జరిగినట్లు గుర్తిస్తే.. కారకులైన తల్లిదండ్రులు, పురోహితులు, పాస్టర్‌, ఖాజీలపై కేసులు నమోదు చేయడం ద్వారా వీటిని అరికట్టగలుగుతామన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీడీపీవోలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు ఈ దురాచారాలను అరికట్టాలన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ తదితరాల నిర్మూలనకు ఛైల్డ్‌లైన్‌-1098 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ జి.ఉమాదేవి, డీఈవో సి.వి.రేణుక, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి, సీడబ్ల్యూసీ సభ్యుడు భార్గవ్‌, ఛైల్డ్‌లైన్‌ జిల్లా సమన్వయకర్త ఎ.రమేష్‌, సీడీపీవోలు జి.మంగమ్మ, లక్ష్మీభార్గవి, రేణుక, పుష్పలత, ఝాన్సీ, నాగమణి, లలిత తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ నిరోధక ప్రచార పత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని