logo

ప్రమాదవశాత్తు నదిలో పడి వృద్ధుడి దుర్మరణం

కృష్ణా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం పెదకళ్లేపల్లిలో చోటుచేసుకుంది.

Published : 04 Jun 2023 03:58 IST

అరజా రాంకృష్ణయ్య (పాత చిత్రం)

పెదకళ్లేపల్లి (మోపిదేవి), న్యూస్‌టుడే: కృష్ణా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం పెదకళ్లేపల్లిలో చోటుచేసుకుంది. మోపిదేవి ఎస్‌ఐ సీహెచ్‌ పద్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరజా రాంకృష్ణయ్య (74) నదిలో స్నానానికి దిగాడు. కొద్ది సేపటి తర్వాత గల్లంతయ్యాడు. అక్కడ ఉన్న వారంతా గుర్తించి వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వీఆర్వో రమణ తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటి తర్వాత మృతదేహం లభించింది. రాంకృష్ణయ్యకు భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులున్నారు. తెదేపా హయాంలో పెదకళ్లేపల్లి నీటి సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


చోడవరం యువకుడు విశాఖలో మృతి

గుర్విందల రాజేష్‌ (పాత చిత్రం)

పెనమలూరు, న్యూస్‌టుడే: మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన యువకుడు విశాఖపట్నంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురివిందల రాజేష్‌ (22) చోడవరం నివాసి. కొంతకాలం కిందట డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తూ... నెల కిందట విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రాంతంలోని తన స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు నాగరాజుతో కలిసి ఓ గదిలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం నాగరాజు ఉద్యోగ నిమిత్తం వెళ్లి సాయంత్రం 5 గంటలకు వచ్చారు. గది తలుపులు కొట్టినా రాజేష్‌ తీయకపోవడంతో నిద్రిస్తున్నాడనుకొని తిరిగి బయటకు వెళ్లారు. రాత్రి 12 గంటల వరకు వేచి చూసినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్నేహితులు, స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా... అప్పటికే రాజేష్‌ ఉరేసుకొని కనిపించాడు. భయాందోళనలకు గురైన అతను వెంటనే రాజేష్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శనివారం సాయంత్రం చోడవరం తీసుకొచ్చారు. మృతదేహంపై గాయాలున్నట్లు తల్లిదండ్రులు గుర్తించి పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐలు రాజేష్‌, శేషు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టానికి తరలించారు. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు అచ్యుతరావు, చిన్నమ్మ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విశాఖపట్నం బదిలీ చేస్తామని సీఐ కిషోర్‌బాబు తెలిపారు.


మిల్లు షెడ్డు పైనుంచి జారిపడి తాపీ మేస్త్రి..

యాకోబు మృతదేహం

నందివాడ, న్యూస్‌టుడే: రైసుమిల్లు షెడ్డుపై పనిచేస్తూ జారిపడి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం నందివాడలో జరిగిందని పోలీసులు తెలిపారు. నందివాడ బాబుకు చెందిన రైసుమిల్లును సుబ్బరాజు అనే వ్యక్తి లీజుకు తీసుకుని బందరుకు చెందిన వేముల బుజ్జి అనే వ్యక్తికి మరమ్మతుల నిర్వహణ పనులు అప్పగించాడు. బుజ్జి తన వద్ద ఉన్న తాపీవారు పనికి రాకపోవడంతో గుడివాడలోని నీలామహాల్‌ సెంటర్‌ వద్ద నుంచి దూళ్లవానిగూడెంకు చెందిన మదిరి యాకోబు(38) అనే యువకుడిని ఉదయం పనికి తీసుకెళ్లాడు. మిల్లు సన్‌షెడ్డుపై పనిచేస్తూ యాకోబు జారిపడ్డాడని, గుడివాడ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని