logo

మట్టి తవ్వకాల రగడ

బాపులపాడు మండలంలో మట్టి తవ్వకాల వ్యవహారం రగడగా మారింది. స్థానికంగా ఇళ్ల స్థలాలు, పొలాలు మెరక చేసుకునే పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది, కొందరు చెరువుల్ని అగాథాల్లా మార్చేయడం వివాదాస్పదమవుతోంది.

Published : 07 Jun 2023 05:02 IST

వేలేరులో అడ్డుకున్న రైతులు ‌

 రంగన్నగూడెంలోనూ ఆందోళన

వేలేరు ఎర్ర చెరువులో తవ్వకాలు అడ్డుకుంటున్న రైతులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : బాపులపాడు మండలంలో మట్టి తవ్వకాల వ్యవహారం రగడగా మారింది. స్థానికంగా ఇళ్ల స్థలాలు, పొలాలు మెరక చేసుకునే పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది, కొందరు చెరువుల్ని అగాథాల్లా మార్చేయడం వివాదాస్పదమవుతోంది. వేసవి ఎండలు కలిసి రావడంతో పలు గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సహజ వనరులైన చెరువులు దెబ్బతినిపోతున్నాయంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా గ్రామ పరిధిలో అదీ.. పొలాలు, ఇళ్ల స్థలాల మెరకకు మాత్రమేనంటూ తవ్వకాలు ప్రారంభించి, యథేచ్ఛగా బయటి అవసరాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. తాజాగా మంగళవారం వేలేరు, రంగన్నగూడెంలో రైతులు ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. వేలేరులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర చెరువులో గత పది రోజులుగా జరుగుతున్న తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. చెరువుని బాగా లోతుగా తవ్వేసి, బయటి ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాన్ని పక్కనబెట్టించి, మట్టి తరలించేందుకు వచ్చిన వాహనాలను వెనక్కి పంపేశారు. ఇకపై బయటి అవసరాలకు తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదంటూ తేల్చిచెప్పారు. మరోవైపు రంగన్నగూడెం భోజనాల గుంట చెరువులోనూ తవ్వకాలపై స్థానిక తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే తవ్వకాలు నిలిపివేయాలని రైతులంతా నీటి పారుదలశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నీటి నిల్వకు వీల్లేని విధంగా చెరువు లోతైపోతుందని సత్వరమే తవ్వకాలు ఆపాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం స్థానిక అవసరాలకే మట్టిని తవ్వామని, ఒక్క వాహనం కూడా బయటకు పంపలేదని పేర్కొంటున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ దుర్గాప్రసాద్‌ని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. పొలాల మెరక కోసం అనుమతులు ఇచ్చామని, వాటిని మీరి తవ్వినట్లు నిర్ధారణైతే తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, మంగళవారం రాత్రి వేలేరు ఎర్ర చెరువులో తవ్వకాలు కొనసాగిస్తూ.. మళ్లీ యంత్రాలు, టిప్పర్లు పెట్టారు. ఈ విషయం తెసుకున్న రైతులు.. చెరువు వద్దకు వెళ్లి, తవ్వకాలను మళ్లీ అడ్డుకున్నారు. బయటి అవసరాల కోసం ఈ విధంగా అక్రమంగా తవ్వకాలు జరిగితే.. సహించేది లేదంటూ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని