logo

అక్రమ లేఔట్లపై కలెక్టర్‌కు వార్డు సభ్యుడి ఫిర్యాదు... గంటలో పోలీస్‌స్టేషన్‌ నుంచి పిలుపు..

అనధికార లేఔట్లపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ మద్దతుతో గెలిచిన వార్డు సభ్యుడిని గంట వ్యవధిలో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 07 Jun 2023 06:04 IST

డిల్లీరావుకు అనధికార లేఔట్లపై వివరిస్తున్న చిట్టిబాబు

మైలవరం, న్యూస్‌టుడే: అనధికార లేఔట్లపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ మద్దతుతో గెలిచిన వార్డు సభ్యుడిని గంట వ్యవధిలో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం పొందుగలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం పొందుగలలో జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర జలశక్తి కార్యదర్శి విని మహాజన్‌తో పాటు కలెక్టర్‌ డిల్లీరావు పాల్గొన్నారు. కుళాయిలు ప్రారంభించాక అక్కడి దేవస్థాన ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ‘సార్‌ మిమ్మల్ని కలవనివ్వడం లేదండీ’ అంటూ మైలవరం పంచాయతీ 12వ వార్డు సభ్యుడు చిట్టిబాబు కేకలు వేయగా, కలెక్టర్‌ ఆయన వద్దకు పరుగున వచ్చారు. విషయమేంటని అడగ్గా, మైలవరం పంచాయతీలో అక్రమంగా లేఔట్లు వేస్తున్నారని, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపారు. దీనిపై పంచాయతీకి, అధికారుల దృష్టికి తెచ్చినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆయన నుంచి సిబ్బందితో వివరాలు నమోదు చేయించిన కలెక్టర్‌ పరిశీలిస్తామని చెప్పి, తిరిగి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అనంతరం కార్యక్రమం పూర్తయి, అధికారులందరూ వెళ్లిపోయాక, వార్డు సభ్యుడు చిట్టిబాబును పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచుకొని, తర్వాత వదిలేశారు. దీనిపై న్యూస్‌టుడే సీఐ మోహన్‌రెడ్డిని సంప్రదించగా, కేంద్ర శాఖ కార్యదర్శి కార్యక్రమంలో అరుపులతో అలజడి సృష్టించే ప్రయత్నం చేసినందుకే స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించామన్నారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కాగా గత కొంతకాలంగా మైలవరం పంచాయతీలో చిట్టిబాబు రెబల్‌గా మారి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు అంశాలపై వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న తాజా పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని