logo

వెంటాడి దాడి..

విజయవాడలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో నెల క్రితం రాత్రి 10.30 సమయంలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువకుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి

Published : 07 Jun 2023 05:27 IST

చిన్నారులను తీవ్రంగా గాయపరుస్తున్న కుక్కలు

 రాత్రి 10 దాటితే ద్విచక్ర వాహనదారులకు గండమే
నియంత్రణ లేదు.. పీహెచ్‌సీల్లో మందులు లేవు

ఈనాడు, అమరావతి : విజయవాడలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో నెల క్రితం రాత్రి 10.30 సమయంలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువకుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చేయి, కాలును తీవ్రంగా గాయపరిచాయి.
* కృష్ణా జిల్లాలోని విజయవాడ శివారు ప్రాంతమైన సనత్‌నగర్‌లో ఇంటి ముందే ఆడుకుంటున్న మూడేళ్ల సిద్ధిక్‌ అనే బాలుడిపై వీధికుక్కలు ఇటీవల దాడి చేశాయి. ముక్కు, ముఖంతో పాటు కాళ్లపై కొరకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
* కృష్ణా జిల్లాలోని కానూరు సమీపంలో ఉన్న మహదేవపురం కాలనీలో రాంబాబు అనే డ్రైవరు రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వీధికుక్కలు వెంటపడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వాహనంపై నుంచి కూడా కిందపడి గాయపడ్డాడు.
* మచిలీపట్నంలోని జగన్నాథపురంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటాడి మరీ కరిచాయి. వాహనం పట్టుతప్పి పడిపోయినా వదలకుండా దాడి చేశాయి.  
* మచిలీపట్నం రాజుపేటలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు వెంటపడి మరీ తీవ్రంగా గాయపరిచాయి.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గత మూడు నాలుగేళ్లలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ నగరం, శివారులోని ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు, స్థానికంగా ఆడుకునే చిన్నారులపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుక్కకాటు ఇంజెక్షన్ల (యాంటీ రేబిస్‌) కోసం బారులు తీరుతున్నారు. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుండడం వల్లే గత రెండు మూడేళ్లలోనే వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడూ తమ ప్రాంతంలో ఇన్ని వీధి కుక్కలను చూసింది లేదని, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వదిలేస్తున్నారంటూ విజయవాడ సహా శివారు ప్రాంతాల్లోని చాలా కాలనీల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా విజయవాడలోని ఆంజనేయవాగు ప్రాంతంలో మేఘన అనే ఐదేళ్ల బాలిక ఇంటి దగ్గరే తల్లి వెనుక వస్తుండగా వీధి కుక్కలు దాడి చేసి కాలిపై తీవ్రంగా గాయం చేశాయి.

సూది మందుల్లేవ్‌...

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్ల క్రితం వరకూ రోజుకు 30 నుంచి 40 మంది వరకూ యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్ల కోసం వచ్చేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య రోజుకు 70కు పైగా పెరిగింది. కుక్కకాటుకు గురై ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య మాత్రమే ఇది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. విజయవాడ నగరంలోని చాలా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కుక్క కాటు ఇంజెక్షన్లు లేవు. దీంతో స్థానికంగా కుక్క కరిచిన వెంటనే స్థానికులు పీహెచ్‌సీలకు వెళ్లడం, అక్కడ ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు తీయడం పరిపాటిగా మారిపోయింది. భవానీపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లగా కుక్కకాటు ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ జీజీహెచ్‌కు హుటాహుటిన తరలించారు. ఇటీవల భవానీపురం ఊర్మిళానగర్‌లో బాలుడిపై కుక్కలు దాడి చేయగా స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కానీ. అక్కడ ఇంజెక్షన్లు లేవని చెప్పడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజీవ్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై దాడి చేసినప్పుడు కూడా స్థానిక పీహెచ్‌సీలో ఇంజెక్షన్లు లేవు. కొత్తాస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

మచిలీపట్నంలో శస్త్రచికిత్సలే లేవు...

మచిలీపట్నంలో వీధి కుక్కల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. చాలాకాలంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా ఆపేశారు. కనీసం వ్యాక్సిన్‌లు సైతం వేయడం లేదు. దీంతో గత నాలుగేళ్లలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. మహిళలు, ద్విచక్ర వాహనదారులను వెంటాడి మరీ దాడి చేస్తున్నాయి. మచిలీపట్నంలోని పశువుల ఆస్పత్రి దగ్గరే వీధి కుక్కల నియంత్రణ కోసం యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ షెడ్‌(ఏబీసీ)ని గత ప్రభుత్వ హయాంలో కట్టారు. గత మూడున్నరేళ్లుగా ఆ భవనం ఖాళీగా పడి ఉంది. వైద్యులు, సిబ్బంది లేరంటూ ఎలాంటి శస్త్రచికిత్సలు చేయడం లేదు.

* విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 30వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు ఇటీవల అంచనా వేశారు. వీటి సంతతిని అదుపు చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఏటా కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలకే రూ.కోటికి పైగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. వీటితో పాటు వీధి కుక్కలకు యాంటీ రేబిస్‌ వాక్సిన్లు వేసేందుకు కూడా ఏటా భారీగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు.

300 మంది వరకూ..

కుక్కల దాడిలో గాయపడి ఒక్క మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికే నెలకు 300 మంది వరకూ యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు వేయించుకునేందుకు వస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఇంజెక్షన్లు వేయించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.
ఒక్క విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే 2020 నుంచి ఏటా 20వేలకు పైగా యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్ల వినియోగం జరుగుతోంది. వీటిలో మొదటి డోసు వేసుకుంటున్న వాళ్ల సంఖ్య 6వేల నుంచి 8వేల వరకూ ఉంటోంది. ఇటీవల రోజుకు 70 మంది వరకూ మొదటి డోసు ఇంజెక్షన్ల కోసం వస్తున్నారు. రి విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లోని వైఎస్‌ఆర్‌ పార్కు సమీపంలో 14 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు వారం క్రితం దాడి చేశాయి. సాయంత్రం సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా రెండు కుక్కలు వెంటపడి తీవ్రంగా గాయపరిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని