logo

పుట్టిన రోజే విగతజీవిగా...

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన చల్లపల్లి మండలం లక్ష్మీపురం దళితవాడలో చోటుచేసుకుంది. మంగళవారం అతడి పుట్టిన రోజు కావడం.

Published : 07 Jun 2023 05:31 IST

యువకుడి  మెడపై బలమైన గాయాలు
వివిధ కోణాల్లో పోలీసుల విచారణ

చిగురుపల్లి వినయ్‌ (పాత చిత్రం)

చల్లపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన చల్లపల్లి మండలం లక్ష్మీపురం దళితవాడలో చోటుచేసుకుంది. మంగళవారం అతడి పుట్టిన రోజు కావడం.. ఈలోపే విగతజీవిగా మారడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యా లేక ఆత్మహత్యా అనేది అంతుచిక్కడం లేదు. చిగురుపల్లి వాసు చిన్నకుమారుడు వినయ్‌(23) మంగళవారం ఉదయం పుచ్చగడ్డ రోడ్డులో శవమై కనిపించాడు. ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లిన కొంతమంది వ్యక్తులు చూసి వినయ్‌ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి రక్తపు మడుగులో శవమై ఉన్న వినయ్‌ మృతదేహాన్ని చూడగా మెడకింద భాగం లోతుగా కోసి ఉంది. సమాచారం అందుకున్న చల్లపల్లి పోలీసులు లక్ష్మీపురం దళితవాడకు వచ్చి మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
* బీటెక్‌ చదివిన వినయ్‌ రాజమండ్రి, విజయవాడలో బ్యాంక్‌ ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకొని ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. ఇంటివద్ద ఖాళీగా ఉండకుండా టైల్స్‌ పనులకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వినయ్‌ పుట్టినరోజు కాగా, సోమవారం రాత్రి ఇంటివద్ద భోజనం చేసి సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లాడు. తర్వాత బయటకు వెళ్లి వస్తానని అమ్మమ్మకు చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. పుట్టినరోజు కేక్‌ కోద్దామని తన స్నేహితులు చెప్పినా వద్దని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
* అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌, చల్లపల్లి సీఐ బి.భీమేశ్వర రవికుమార్‌, ఎస్‌.ఐ. చినబాబు వినయ్‌ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినయ్‌ తండ్రి వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వో బెల్లంకొండ గోపి శవపంచనామా నిర్వహించగా, అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని