logo

చేనేతకు రంగులద్దాలి..!

కాలానుగుణంగా మార్పులు లేకుంటే మనుగడ కష్టసాధ్యం. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా.. వ్యాపార, ఉత్పాదక రంగాల్లో మార్పు ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Published : 07 Jun 2023 05:35 IST

పరిశ్రమకు ఉపయోగించే నూలు 

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: కాలానుగుణంగా మార్పులు లేకుంటే మనుగడ కష్టసాధ్యం. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా.. వ్యాపార, ఉత్పాదక రంగాల్లో మార్పు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నడిచేందుకు ఆయా సంస్థలు, పరిశ్రమలు అహరహం శ్రమిస్తుంటాయి. వినూత్న మార్పుల దిశగా పయనిస్తుంటాయి. జిల్లా చేనేత విభాగం ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తుండటంతో వాటి ఉత్పత్తి నానాటికీ తీసికట్టు నాగంబొట్టు చందంలా పరిస్థితి మారుతోంది. ఇంకోపక్క చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచటానికి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు రూపొందించాయి. అవి నాలుగేళ్ల నుంచి అమలు కాకపోవటంతో పరిశ్రమ క్షీణిస్తోంది.

జిల్లాలో ప్రధానంగా నేత చీరలను ఉత్పత్తి చేస్తుంటారు. అవి 60 ఏళ్ల పైనవారికి మాత్రమే నచ్చేలా, నప్పేలా ఉండటంతో మార్కెట్‌ క్రమంగా క్షీణిస్తోంది. ఇటీవల నూలు ధర తగ్గినా ఉత్పత్తి పెరగకపోగా.. క్రమంగా క్షీణిస్తోంది. అటు సహకార సంఘాల్లో, ఇటు ప్రయివేటు మాస్టర్‌ వీవర్ల వద్ద కూడా ఉత్పత్తి గణనీయంగా పడిపోతోంది. రెండు నెలల నుంచి వేసవి కారణంగా మరింత దిగజారింది. ఈ ఏడాది జనవరి నాటికి అమరావతి సూపర్‌ 80 నంబర్‌ బేలు(20 డబ్ల్యూలు) ధర రూ.3300 నుంచి రూ.2600 తగ్గింది. ఇదే ‘60 నంబరు’ నూలు రూ.2500 నుంచి రూ.1800 వరకు పడిపోయింది. నూలు ధరలు తగ్గినా పరిశ్రమ మీద ఎలాంటి ప్రభావం కనిపించటం లేదు.

డిజైన్లు మార్చకుంటే...

చేనేత ఉత్పత్తికి రంగులద్దే ప్రక్రియలో భాగంగా ఇటీవల చేనేత జౌళిశాఖాధికారులు కొనుగోలుదారులతో పెడనలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘మార్కెట్‌ అవసరాలు ఏంటి? మీకు ఎలాంటి రకాలు అవసరం?’ తదితర సమాచారాన్ని వారి నుంచి సేకరించారు. అందులో చాలామంది చీరలను 30 ఏళ్లు, 40 ఏళ్ల పైబడి వయసున్న మహిళల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని కోరారు. డిజైన్లు, ప్యాట్రన్‌, రంగులు తదితరాలన్నీ మార్పు చేస్తే అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని తేల్చిచెప్పారు. కొనఊపిరిలో ఉన్న సంఘాలు తమ పాత పద్ధతిలోనే ఉత్పత్తి కొనసాగిస్తుండటంతో పరిశ్రమ నిలదొక్కుకునేలా ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. ప్రస్తుత రకాలను మార్చటానికి కార్మికులు సిద్ధంగా లేకపోవటంతో కొత్త రకాలు ఊపిరి పోసుకోవటం లేదు. యువత దూరమై మలితరం మాత్రమే వినియోగదారులుగా మిగలటానికి ఇదే ప్రధాన కారణం.


పరిశ్రమను ఆదుకోవటానికి చర్యలు

పరిశ్రమను నిలబెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తి చేయటానికి సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేశాం. తరచూ సంఘ మేనేజర్లు, ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.
రఘునంద, ఏడీ చేనేత జౌళి శాఖ, కృష్ణా


జిల్లాలో ఇలా..
వృత్తిపై ఆధారపడుతున్న వారు: 15,904
చేనేత సంఘాలు: 54
క్రియాశీలకంగా ఉన్నవి: 34
ఈ సంఘాల్లో సభ్యులు: 5380


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని