logo

చేసేందుకా.. మేసేందుకా?

పామర్రు పరిధిలో ఎగువ గుడివాడ సెక్షన్‌ కింద 2023-24 నిర్వహణ పనుల కింద ఎగువ పుల్లేరు కాలువ, రైవస్‌ కాలువ.. బ్రాంచ్‌ల్లో తూటికాడ తొలగింపునకు రూ.23.70 లక్షల అంచనాతో టెండర్‌ పిలిచారు.

Updated : 08 Jun 2023 06:23 IST

ఎమ్మెల్యేలు చెబితే సరి..
నిర్వహణ పనులన్నీ ముక్కలే..
టెండర్ల దాఖలు తక్కువకే
ఈనాడు, అమరావతి

* పామర్రు పరిధిలో ఎగువ గుడివాడ సెక్షన్‌ కింద 2023-24 నిర్వహణ పనుల కింద ఎగువ పుల్లేరు కాలువ, రైవస్‌ కాలువ.. బ్రాంచ్‌ల్లో తూటికాడ తొలగింపునకు రూ.23.70 లక్షల అంచనాతో టెండర్‌ పిలిచారు. దీనికి ఓ గుత్తేదారు రూ.16.50 లక్షలకు టెండర్‌ వేశారు. అంటే దాదాపు 31 శాతం తక్కువ. ఆయనకు పనులు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు.

* ఏలూరు కాలువలో 4.250 కిమీ నుంచి 18.500 కిమీ వరకు తూటి కాడ తొలగింపు,  రసాయనాలు చల్లడం, ఫ్లౌవింగ్‌ ద్వారా తూటికాడ తొలగింపునకు రూ.22.60 లక్షల అంచనాతో టెండర్‌ పిలిచారు. దాదాపు 35 శాతానికి తక్కువకు కోట్‌ చేశారు. దీంతో ఆ పనులు ఆ గుత్తేదారుకే ఇవ్వాలి. ఇంకా ఖరారు కాలేదు.

మ్మడి కృష్ణా జిల్లాలో జలవనరుల శాఖలో నిర్వహణ పనుల తీరు అక్రమాలకు నిలయంగా మారింది. అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడం లేదు. ఉద్యోగులు, విద్యార్థుల హాజరు సైతం బయోమెట్రిక్‌, ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా నమోదు చేస్తుంటే.. జలవనరుల శాఖలో అసలు చేసిన పనులకు ఎంబీలు(కొలతల పుస్తకం) మినహా ఎలాంటి ఆధారాలు లేదు. అసలు పనులు జరుగుతున్నాయో లేదో... కనీసం పర్యవేక్షణ లేదు. నాణ్యత పరీక్షలు బోగస్‌గా మారాయి. గత ఏడాది నిర్వహణ(ఓఅండ్‌ఎం) పనులు ప్యాకేజీలుగా మార్చి 5 శాతం వరకు అధిక ధరలకు అప్పగించేలా చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు ఈసారి ముక్కలు చెక్కలు చేసేందుకే అనుమతించారు. చిన్నచిన్న పనులుగానే టెండర్లను పిలిచారు. దీనికి గుత్తేదారులు పోటీలు పడి 30-45 శాతం తక్కువకే టెండర్లు దాఖలు చేశారు. వెరసి అసలు పనులు చేసేందుకే ఇంత తక్కువకు టెండర్లను వేశారా..? అనే అనుమానాలు ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన పనులకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల టెండర్లను పిలిచి.. సోమ, మంగళవారాల్లో తెరిచారు. బుధవారం టెండర్‌ విశ్లేషణ(ఎవాల్యూషన్‌) చేయగా.. త్వరలో ఖరారు చేసి ఒప్పందాలు చేసుకోవాలి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 151 నిర్వహణ పనులకు మూడు విభాగాల కింద టెండర్లు పిలిచారు. వీటి విలువ రూ.28.06 కోట్లు. ఈ ఏడాది నిర్వహణ పనులకు రూ.30 కోట్లు కేటాయించారు. బుధవారమే కాలువలకు నీరిచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆసాంతం కాలువల్లో నీరు పారనున్న వేళ నిర్వహణ పనులకు తావెక్కడని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వంద క్యూసెక్కుల చొప్పున కాలువలకు నీరిచ్చారు. మరో వారం.. పది రోజుల తర్వాత 200 క్యూసెక్కులు ఇవ్వనున్నారు. ఆ ప్రవాహానికి తూటికాడ కొట్టుకుపోయి లాకులు/గేట్లు/తూములు వద్ద ఆగిపోతుంది. దీనిని తొలగిస్తే సరిపోతుంది. ఇందుకు రూ.లక్షల అంచనాలతో టెండర్లను పిలిచారు. దీంతో గుత్తేదారులు పోటీపడి తక్కువకే టెండర్లు వేశారు. రసాయనాలు కాలువలో చల్లుతారు. దీనికి లెక్కలేదు. నాణ్యత పరీక్షలు ఊసే ఉండదు. కేవలం కాగితాల్లోనే ఉంటుంది. ఇక ఎవరి కమీషన్లు వారివే. ఎంబీ చేసి బిల్లులు చెల్లించేందుకు మొత్తం 10 శాతం వరకు గుత్తేదారులు ఇస్తారు. ముందుగానే అంచనాలు పెంచి వేసేందుకు గుత్తేదారుల నుంచి మామూళ్లు అందుతున్నాయి. అయితే ఈసారి ప్రజాప్రతినిధులు వారి అనుచరులకు గ్రామాల వారీగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికి టెండరు వచ్చినా.. ఎమ్మెల్యే సూచించిన వారికే ఇవ్వాల్సిందేనని అంటున్నారు.

గత ఏడాది ప్యాకేజీలు...

2022-23 ఏడాదికి రూ.50 కోట్లు నిర్వహణ పనులకు కేటాయించగా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని 30 నుంచి 70 వరకు పనులు గుదిగుచ్చి ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. దాదాపు రూ.40 కోట్లు విలువైన 250 పనుల వరకు.. ఆరు వరకు ప్యాకేజీలు పిలిచారు. వీటిని ఎమ్మెల్యే బినామీలకు, అనుచరులైన గుత్తేదారులకు అప్పగించారు. ఎమ్మెల్యేల జోక్యంతో 5శాతం వరకు అధిక ధరలకే టెండర్లను దక్కించుకున్నారు. వీటిలో చాలావరకు పనులు చేయలేదు. దీనిపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి స్పందించి కృష్ణా జిల్లా గత కలెక్టర్‌ రంజిత్‌బాషా విచారణకు ఆదేశించారు. ఉయ్యూరు ఆర్డీవో విజయ్‌కుమార్‌ విచారణ చేస్తే అసలు పనులు ప్రారంభించలేదని ఫిబ్రవరిలోనే తేలింది. తర్వాత కూడా అవి జరగనేలేదు. తాజాగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. సగానికి పైగా దోపిడీ జరిగిందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది ప్యాకేజీల జోలికి వెళ్లకుండా ముక్కలనే ఉంచారు. దీనిపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. ప్యాకేజీలు చేస్తే.. బడా గుత్తేదారులు త్వరితగతిన పనులు చేస్తారని చెప్పిన అధికారులు ప్రస్తుతం పనులు జరగకపోవడంపై, చిన్న పనులుగా పిలవడంపై మౌనంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినట్లు చేస్తున్నారని అంటున్నారు. వాస్తవం వివరించే ప్రయత్నం చేస్తే.. ‘బుద్ధి లేదా..! ఒళ్లు దగ్గరపెట్టుకోండి..!’ అనే హెచ్చరికలు వస్తుంటాయని ఓ ఇంజినీరు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని