కొమ్ము కాస్తూ.. తప్పు దాస్తూ..!
చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన కొందరు పోలీసులకు అధికార పార్టీ నేతల ఆదేశాలే శిరోధార్యం అవుతున్నాయి. వారు చెప్పినట్లే తలాడిస్తున్నారు.
పోస్టింగులు, బదిలీలకు నేతల చుట్టూ ప్రదక్షిణ
విధి నిర్వహణలో అధికార పార్టీపై వీర విధేయత..
ఈనాడు - అమరావతి'
చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన కొందరు పోలీసులకు అధికార పార్టీ నేతల ఆదేశాలే శిరోధార్యం అవుతున్నాయి. వారు చెప్పినట్లే తలాడిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే ప్రజాప్రతినిధులు చెప్పినట్లే కేసులు నమోదు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బాధితుల పక్షాన నిలవాల్సింది పోయి నేతలకే వత్తాసు పలుకుతున్నారు. ఐపీసీని వదిలేసి.. వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోస్టింగుల్లో నేతల పాత్ర కీలకం కావడంతో వారు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నెలకొన్నాయి. గిట్టని వారిని కట్టడి చేసేందుకు నేతలు తమ కనుసన్నల్లో పనిచేసే పోలీసులను వినియోగిస్తున్నారు.
నాయకులు సిఫార్సు లేఖలు ఇవ్వనిదే పోస్టులు వేసే పరిస్థితి లేదు. ఒక రకంగా ఇవే ప్రామాణికంగా మారాయి. లేఖలు లేకపోతే అసలు పరిగణనలోకి తీసుకోని పరిస్థితి. తమకు నచ్చిన చోటుకు వెళ్లేందుకు నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. పనితీరు ఆధారంగా కాకుండా తమకు అనుకూలంగా పనిచేస్తారా? లేదా తమ సామాజిక వర్గమా? అనేది చూసి మరీ పోస్టింగ్‌లు వేయించేకుంటున్నారు. దీనికి తోడు వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులకు డబ్బులు ముట్టజెబితేనే వారికి సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. వచ్చేది ఎన్నికల సమయం కావడంతో పోస్టింగ్‌కు నేతల సిఫార్సు లేఖ కచ్చితంగా ఉండాల్సిందే. నాయకుల అండతో పోస్టింగ్ వేయించుకున్న అధికారులు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారికి అనుకూలంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
వైకాపా నేతలకే వత్తాసు
స్టేషన్‌ను బట్టి నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కువ ఆదాయం ఉండే పీఎస్ అయితే ఆ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. వారు చెప్పినంత ఇచ్చేందుకు కూడా కొందరు వెనుకాడడం లేదు. అంత మొత్తంలో డబ్బు కట్టి పోస్టింగ్ తెచ్చుకున్న వారు.. ఆతర్వాత ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓ సీఐ సంబంధిత ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు సమర్పించి పోస్టింగ్ తెచ్చుకున్నారు. నూతనంగా ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఓ అధికారి లా అండ్ ఆర్డర్‌లో పని చేయాలనే ఆశతో సదరు నేతకు రూ.10 లక్షలిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి సదరు ఎమ్మెల్యే ఆశీస్సులు పొందేందుకు స్టేషన్‌కు వచ్చే కేసుల్లో కొమ్ము కాస్తున్నారు.
* నగరంలో ఓ సీఐకి అధికార పార్టీ యువనేత పోస్టింగ్ వేయించారు. దీంతో అప్పటి నుంచి ఆ అధికారికి యువనేత మాటలే శిరోధార్యం. ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ గతంలో అదే నియోజకవర్గంలో పనిచేశారు. ఆ సమయంలో అక్కడి నేతకు అన్ని విధాలా అండగా ఉన్నారు. దీంతో అదే సీఐని తన నియోజకవర్గంలో కీలకంగా ఉండే స్టేషన్‌లో పోస్టింగ్ వేయించుకున్నారు. ఓ ఇన్‌స్పెక్టర్ అయితే అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తెగ ఆరాటపడతారు. అధికార పార్టీ వారైతే చాలు వారికి చట్టంతో పని లేకుండా సదరు నేత మాటలే చట్టంగా పనిచేస్తుంటారు.
* ఓ సబ్‌డివిజన్‌లో పోలీసులు ప్రజాప్రతినిధి కుమారుడు చెప్పినట్టు వినాల్సిందే. ఆయన అభిమతానికి అనుగుణంగా వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఆ నేత ప్రధాన అనుచరులు పెద్దఎత్తున ఇసుక, బుసక అక్రమ రవాణా చేస్తున్నా చూడరు. చివరకు గంజాయి బ్యాచ్‌ను పట్టుకున్నా యువనేత ఫోన్ చేస్తే కేసు ఉండదు. బాపట్ల జిల్లాకు సరిహద్దున ఉండే స్థానిక ప్రజాప్రతినిధికి బినామీగా వ్యవహరించే వ్యక్తి అన్ని స్టేషన్లను ప్రభావితం చేస్తున్నారు. మట్టి రవాణాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
* కృష్ణా జిల్లాకు సరిహద్దు నియోజకవర్గ స్టేషన్ల పరిధిలో ఏ కేసు నమోదు చేయాలన్నా అక్కడి నేత దృష్టికి తీసుకువెళ్లాల్సిందే. ఎస్సై, సీఐ పోస్టులకు రూ.5-10 లక్షల వరకూ ఆయనకు కప్పం కట్టాల్సిందే. డబ్బు చెల్లించి వేయించుకున్న పోస్టులో ఇతరులు ఎవరైనా ఎక్కువ మొత్తం చెల్లిస్తే వారికే అవకాశం కల్పిస్తారు. గతంలో రూ.5 లక్షలు చెల్లించి పోస్టింగ్ వేయించుకున్న ఎస్సై.. నాయకుడికి తెలియకుండా కేసులు నమోదు చేస్తున్నారనే కారణంతో పక్కకు తప్పించారు. తర్వాత సర్దుబాటు చేసుకోవడంతో తిరిగిచ్చారు. ఓ సీఐ అయితే ప్రజాప్రతినిధి జేబులోని మనిషిలా వ్యవహరిస్తున్నారన్న అపవాదు ఉంది.
వారు చెప్పినట్లు వినాల్సిందే...
ఎన్టీఆర్ జయంతి రోజు.. పటమటలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం దిమ్మె చుట్టూ వైకాపా వారు ఆ పార్టీ జెండాలు కట్టారు. దీనిని అడ్డుకోని పోలీసులు.. వైకాపా జెండాలను తొలగించేందుకు యత్నించిన తెదేపా నేతలను అడ్డుకున్నారు. జెండాల తొలగింపుపై సదరు నేతతో పోలీసు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపినా ఆయన ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు.
ఇటీవల మచిలీపట్నంలో వైకాపా ఫ్లెక్సీకి ప్రతిగా జనసేన, తెదేపా పెట్టిన ఫ్లెక్సీలను చిలకలపూడి, ఆర్‌పేట సీఐలే దగ్గరుండి తీయించేశారు. కానీ వైకాపా ఫ్లెక్సీ జోలికి వెళ్లలేదు. నాలుగు నెలల కిందట కృష్ణలంక స్టేషన్ పరిధిలో వైకాపా నేత గడప గడపకు.. కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొందరు మహిళలు ప్రశ్నించారని తెల్లారేసరికల్లా వైకాపా నాయకులు ఏకంగా వారి ఇంటిపై దాడి చేసి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ కేసులో వైకాపా నాయకుల మీద చిన్న కేసు నమోదు చేశారు. బాధితులపై మాత్రం హత్యాయత్నం కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా వారిని నిత్యం ఠాణాకు పిలిపించి వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ గుండెపోటుతో మరణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!