logo

మేమేం చేయలేం..!

‘అర్ధరాత్రి సమయంలో మా గ్రామ పంచాయతీ చెరువు మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. పోలీస్‌ రక్షణ కల్పిస్తే అక్రమాన్ని అడ్డుకుంటాం.

Published : 08 Jun 2023 05:32 IST

మట్టి తరలింపును అడ్డుకోవటంలో శాఖల మీనమేషాలు
కంకిపాడు, న్యూస్‌టుడే

చెరువులో మట్టి తరలింపుతో ఏర్పడిన గొయ్య్ఠ్ఠి

‘అర్ధరాత్రి సమయంలో మా గ్రామ పంచాయతీ చెరువు మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. పోలీస్‌ రక్షణ కల్పిస్తే అక్రమాన్ని అడ్డుకుంటాం. నేను, సిబ్బంది మాత్రమే వెళ్తే మాపై దాడి జరిగే అవకాశం ఉంది. మట్టి తరలింపునకు మా అనుమతులు, ఉన్నతాధికారుల ఆదేశాలూ లేవు.’     - పంచాయతీ కార్యదర్శి.

‘మేమేం చేస్తాం. మీరు యంత్రాలు, అక్రమార్కులను పట్టుకుని అప్పగించండి. రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. మా అంతట మేం చేసేదేమీ లేదు’.

పోలీస్‌ అధికారులు

‘చెరువు గ్రామ పంచాయతీది. పాలకవర్గం, కార్యదర్శి సంబంధిత ధ్రువపత్రాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోగలం.’

రెవెన్యూ అధికారులు.

పై మూడు వ్యాఖ్యల సారాంశం ఏమింటంటే.. అక్రమ తోలకాలను ఎవరూ తమ బాధ్యతగా భావించి అడ్డుకోరని.. అడ్డుకునేందుకూ సుముఖంగా లేరని.. ఎందుకంటే ఈ అక్రమంలో పాత్రధారులు, సూత్రధారులంతా అధికార పార్టీకి చెందినవారు కావడమే కారణం. ప్రభుత్వ ఆస్తులు, సంపద పరిరక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాధ్యత తమదికాదంటూ ఇతర శాఖలపైకి నెట్టివేస్తున్నారు. కంకిపాడు మండలం జగన్నాథపురం చెరువు మట్టి తరలింపు ఇందుకో ఉదాహరణ.

అసలేం జరిగింది?

జేసీబీని అడ్డుకుంటున్న మండల తెదేపా అధ్యక్షుడు రవీంద్ర, స్థానికులు

జగన్నాథపురంలో చెరువు మట్టి తవ్వకం, తోలకాలపై ఈ నెల 5వ తేదీన ‘ఈనాడు’ దినపత్రికలో ‘చెరువు మట్టి..కొల్లగొట్టి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఆ రోజు తవ్వకాన్ని ఆపారు. మరుసటి రోజు రాత్రి మళ్లీ మొదలు పెట్టారు. మా వెనుక నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఉన్నారంటూ తోలకాన్ని కొనసాగించారు. ఈ విషయం ఎమ్మెల్యే వరకు వెళ్లింది. తన పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించినట్లు చెబుతున్నారు. అయినా మంగళవారం రాత్రి మళ్లీ పనులు మొదలు పెట్టడంతో తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు, జగన్నాథపురం మాజీ సర్పంచి, మరికొందరు గ్రామస్థులు జేసీబీలను అడ్డుకున్నారు. కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. యంత్రాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది రాత్రి జరిగిన ఘటనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మట్టి తవ్వకాన్ని ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

పరిష్కారం ఇలా..

ఈ ప్రాంతంలో చెరువు మట్టికి గిరాకీ అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీశాఖ వేలం నిర్వహిస్తే గ్రామానికి భారీగా ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు