logo

నాడు..నేడు పూర్తి ఎన్నడు?

‘కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నాడు-నేడు రెండో దశ పనులు అత్యంత అధ్వానంగా సాగుతున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి రెండో దశ పనులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాల్సి ఉంది. కానీ.. ఏ పాఠశాలలోనూ పూర్తిస్థాయిలో పనులు చేపట్టింది లేదు.

Updated : 09 Jun 2023 06:19 IST

బడులు తెరవనున్నా... వెక్కిరిస్తున్న మొండిగోడలు
ఎక్కడా పూర్తికాని తరగతి గదుల నిర్మాణం
ఈనాడు, అమరావతి - మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

మచిలీపట్నం రుస్తుంబాద బాలికల పాఠశాలలో అసంపూర్తిగా అదనపు తరగతి భవనం

‘కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నాడు-నేడు రెండో దశ పనులు అత్యంత అధ్వానంగా సాగుతున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి రెండో దశ పనులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాల్సి ఉంది. కానీ.. ఏ పాఠశాలలోనూ పూర్తిస్థాయిలో పనులు చేపట్టింది లేదు. పాఠశాల ఆవరణల్లోనే ఇసుక, సిమెంట్‌ బస్తాలు, ఇటుకల గుట్టలు, తవ్వేసిన గుంతలతో విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడేలా అడ్డుగా పడేసి ఉన్నాయి. రెండో దశలో ప్రధానంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం.. ఎక్కడికక్కడే ఉన్నాయి. మొండి గోడలు, స్లాబుల్లేని గదులు వెక్కిరిస్తున్నాయి. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికి రూ.500 కోట్లకు పైగా నాడు నేడు రెండో దశ కోసం ఖర్చు చేసినట్టు చెబుతున్నా.. ఆ స్థాయిలో సౌకర్యాల ఊసేలేదు. మరో మూడు రోజుల్లో జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇరుకైన తరగతి గదులు, అరకొర సౌకర్యాల నడుమ ఈ ఏడాది కూడా విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పదు.’

కొన్నిచోట్ల అసలు ఆరంభమే కాలేదు

ఎన్టీఆర్‌ జిల్లాలో 586, కృష్ణాలో 488 పాఠశాలల్లో నాడునేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి. వీటిలో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉండగానే గత ఏడాది ఆరంభించిన పనుల్లో భాగంగా రెండు జిల్లాల్లో కలిపి 168 పాఠశాలల్లో 1,088 అదనపు తరగతి గదులను నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ.. జిల్లాల విభజన తర్వాత కృష్ణా, ఎన్టీఆర్‌లో వేర్వేరుగా పనులు మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 578, కృష్ణాలో 167 అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో కనీసం పది శాతం కూడా ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. కొన్నిచోట్ల అసలు ఆరంభమే కాలేదు. గత విద్యా సంవత్సరానికి ముందు ప్రారంభించిన రెండో దశ పనులను 2023 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టారు. కానీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కూడా ఈ పనులు పూర్తికావని స్వయంగా ప్రధానోపాధ్యాయులే చెబుతుండడం గమనార్హం.

నిధులు రావడంలోనే తీవ్ర జాప్యం...

రెండు జిల్లాల్లో నిధుల విడుదలలో జాప్యంతోనే చాలాకాలం పనులు ఆగిపోయాయి. దీనికితోడు సిమెంటు, ఇసుక రాలేదని మరికొన్నాళ్లు ఆపారు. మళ్లీ కొద్దిరోజులు పనులు చేపట్టి కొన్నాళ్లు చేశాక ఆపేశారు. పాఠశాలలు ఆరంభిస్తుండడంతో ఇప్పుడు మళ్లీ హడావుడి చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రం నిధులు లేవని ఎక్కడి పనులక్కడే ఆపేసి కూర్చున్నారు. విజయవాడ విద్యాధరపురంలో దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ వంటి పాఠశాలల్లో పూర్తిగా పనులే ఆరంభించలేదు. పాత భవనాలను కూల్చేసి.. విద్యార్థులను వేరేచోటికి పంపేశారు.ఎన్టీఆర్‌ జిల్లాలో రెండో దశ ఆరంభం నుంచి నత్తనడకనే పనులు సాగుతున్నాయి. ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో 15శాతం చొప్పున వేసే రివాల్వింగ్‌ ఫండ్‌ ఉన్నంత వరకూ పనులు సాగుతున్నాయి. నిధులు అయిపోతే.. ప్రభుత్వం ఎప్పుడిస్తుందా అని నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇరు జిల్లాల్లోని చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు-నీటి సౌకర్యం, విద్యుత్తు ఉపకరణాలు, ఆంగ్ల ల్యాబ్‌, వంట గది షెడ్డు, ప్రహరీ, తాగునీరు, ఫర్నీచర్‌, భవనాలకు రంగులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, చిన్న, పెద్ద మరమ్మతులు వంటివి కూడా ఇప్పటికీ అరకొరగానే పూర్తిచేశారు. చాలాచోట్ల మరుగుదొడ్లు కూడా మొండి గోడల వరకే వచ్చి ఆగిపోయాయి.

అన్నిచోట్లా అరకొరగానే పనులు..

ఎన్టీఆర్‌ జిల్లాలో 17 మండలాల్లోని 586 పాఠశాలల్లో నాడు నేడు పనులు సాగుతున్నాయి. విజయవాడ నగరంలో 89 పాఠశాలల్లో పనులు నడుస్తున్నాయి. వీటిలో నగరంలోని 33 ఉన్నత పాఠశాలల్లో 238 తరగతి గదుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ కనీసం 20 శాతం కూడా పనులు పూర్తికాలేదు. వీటితోపాటు కంచికచర్ల, మైలవరం, నందిగామ, రెడ్డిగూడెం, చందర్లపాడు, గంపలగూడెం, జగ్గయ్యపేట, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, వత్సవాయి, వీర్లుపాడు, విజయవాడ గ్రామీణ మండలాల్లో నాడు నేడు రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

కృష్ణా జిల్లాలోనూ 488 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మండలాల వారీగా.. గూడూరులో 14, బందరు 48, అవనిగడ్డ 10, మొవ్వ 20, బాపులపాడు 21, పమిడిముక్కల 22, చల్లపల్లి 21, పెడన 27, బంటుమిల్లి 20, కృత్తివెన్ను 18, గన్నవరం 23, గుడివాడలో 26 చొప్పున నాడునేడు రెండో దశ సాగుతోంది. కానీ.. ఎక్కడా పనులు పూర్తిచేసిన దాఖలాలు లేవు. కృత్తివెన్ను, బాపులపాడు, ఉంగుటూరు, గుడివాడ, గన్నవరంలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి.

గూడూరు ఉర్దూ పాఠశాలలో పూర్తికాని మరుగుదొడ్ల నిర్మాణం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని