logo

అడ్డుకుంటే అంతే..!

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బయట అవసరాల కోసం తమ గ్రామ సహజ వనరైన చెరువును ధ్వంసం చేయవద్దంటూ వేడుకున్న రైతులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యకాండకు దిగారు.

Published : 09 Jun 2023 04:39 IST

మట్టి తవ్వకాలకు అధికార పార్టీ నాయకుల యత్నం
పోలీసులకు ఫిర్యాదు, బోరు కనెక్షన్లు కట్‌
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

లేఔట్‌లోకి చేరిన నీరు

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బయట అవసరాల కోసం తమ గ్రామ సహజ వనరైన చెరువును ధ్వంసం చేయవద్దంటూ వేడుకున్న రైతులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యకాండకు దిగారు. బాపులపాడు మండలం ఎర్రకుంట చెరువులో జరుగుతున్న తవ్వకాలను గత కొన్నిరోజులుగా స్థానిక రైతులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తవ్వకందార్లకు, రైతులకు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రెండు గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ చెరువులో తొలుత వేలేరు పరిధిలో తవ్వకాలు జరిపారు. కొన్నిరోజుల తర్వాత వీటిని స్థానిక రైతులు సమర్థంగా అడ్డుకోవడంతో, ఎలాగైనా మట్టి తరలించి తీరాలనే పట్టుదలతో అధికార పార్టీ నాయకులు, వ్యాపారులు బుధవారం రాత్రి బాపులపాడు పరిధిలో తవ్వకాలు జరపడానికి సన్నాహాలు చేశారు. దీంతో వేలేరు రైతులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని గట్టిగా అభ్యంతరం తెలిపారు. తవ్వకందార్లు కూడా పెద్ద సంఖ్యలోనే తమ అనుచరుల్ని మోహరించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. చివరకు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయాల్సి వచ్చింది. గురువారం ఉదయం ఎలాగైనా మట్టిని తరలించి తీరాలనే సంకల్పంతో తవ్వకందార్లు కార్యాచరణ చేపట్టారు. ఈ సంగతి గ్రహించిన వేలేరు రైతులు, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మట్టిని తరలించే వాహనాలు రాకపోకలకు ఏర్పాటు చేసిన మార్గాన్ని నీటితో పూర్తిగా తడిపేశారు. దీంతో తవ్వకాలు జరిపినా, మట్టిని తరలించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువై సమీపంలో ఉన్న బాపులపాడు-2 జగనన్న లేఔట్‌లోకి చేరాయి. బుధవారం నుంచి ఈ లేఔట్‌లో ప్లాట్ల విభజనకు వీలుగా అధికారులు పనులు చేపట్టారు. ఇక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని, సర్వే రాళ్లు పాతించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నీరు చేరడంతో ఆ పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. వేలేరుకు చెందిన రైతులు, కొందరు తెదేపా నాయకులే దీనికి కారకులంటూ అధికార పార్టీ నాయకులు ప్రచారం చేశారు. పైగా గురువారం ఉదయం గాలివానకు పడిపోయిన రెవెన్యూ అధికారులు వేసిన షామియానాను సైతం రైతులే పడగొట్టారంటూ ఆరోపించారు. ఈమేరకు రెవెన్యూ సిబ్బంది చేత హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. మరోవైపు జగనన్న లేఔట్‌లోకి ఉద్దేశపూర్వకంగానే నీళ్లు పెట్టి ప్లాట్ల కేటాయింపు పనుల్ని అడ్డుకున్నారంటూ వైకాపా నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదార్లను సమీకరించి ఆందోళనకు చేయించారు. ఇదే క్రమంలో నీరు పెట్టేందుకు ఉపయోగించిన మూడు బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు తొలగింపజేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రైతుల్ని ఇలా ఇబ్బందులకు గురి చేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని