logo

ఆసుపత్రికి బయలుదేరి అనంత లోకాలకు...

ద్విచక్ర వాహనాన్ని కంటెయినర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణంపాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 09 Jun 2023 04:39 IST

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

సుబ్బారావు, లలితమ్మ (పాత చిత్రాలు)

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కంటెయినర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణంపాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు పోలీసుల కథనం మేరకు... ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన వినుకొండ సుబ్బారావు(55), లలితమ్మ(50) దంపతులు మూడు దశాబ్దాల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లలితాపురంలో స్థిరపడ్డారు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇల్లెందు-ఖమ్మం ప్రధాన రహదారి సుభాష్‌నగర్‌ వద్ద వీరి వాహనాన్ని కంటెయినర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన లలితమ్మను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ కరుణాకర్‌ తెలిపారు.

పిల్లలు ఎదిగివచ్చే సమయానికి...

సుబ్బారావు ద్విచక్ర వాహనం మీద స్టీల్‌, అల్యూమినియం పాత్రలను పెట్టుకొని ఇల్లెందు చుట్టు పక్కల గ్రామాల్లో వాయిదా పద్ధతిలో విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రోజూ కష్టపడితేనే పూట గడిచేది. కుమారుడు, ఇద్దరు కూతుళ్లను చదివించుకుంటున్నారు. బాగా చదివిన పిల్లలు ఇప్పుడిప్పుడే ప్రయోజకులవుతున్నారు. కుమారుడు రాంబాబు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా... కుమార్తె రాధిక పాల్వంచ మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. చిన్న కూతురు మౌనిక ఇల్లెందులో డిగ్రీ పూర్తి చేశారు. పిల్లలు ఎదిగి ప్రయోజకులుగా మారడం రెండేళ్ల కిందట లలితాపురంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదంలో దంపతులు దూరం కావడంతో కుమారుడు, కుమార్తెలు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని