logo

ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాటం

ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము అన్నారు.

Published : 09 Jun 2023 04:39 IST

డీఆర్వోకి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆయనతోపాటు పలువురు నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్‌లు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేస్తామని అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి ఇప్పుడు గ్యారంటీ పింఛను స్కీంను అమలు చేస్తామని చెప్పడం ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పి వాళ్లలో కొంతమందినే క్రమబద్ధీకరించడం తగదని అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చూడాలని గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్‌ సూర్యనారాయణను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ ఆఫీస్‌ బేరర్ల ధ్రువపత్రాల విషయంలో అక్రమంగా బదిలీల్లో మినహాయింపు పొందారని ఉద్దేశపూర్వకంగా తమ సంఘాన్ని మాత్రమే తప్పు బడుతున్నారని, ఇవే నిబంధనలు మిగిలిన సంఘాలకు వర్తిస్తాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. తమ సంఘం ఎప్పుడూ నియమ నిబంధనలు ఉల్లఘించలేదని, ఇక ముందు కూడా చేయదని స్పష్టం చేశారు. ఇకపై కూడా పోరాటాలు చేస్తూనే ఉంటామని, ఆవిషయంలో ఎలాంటి రాజీలేదని అన్నారు. నాయకులు జి.శ్రీనివాసరావు, సురేష్‌నాయక్‌, సాయిరామ్‌నాయక్‌, వి.పరమేశ్వరరావు, సలీం, రవి, రవీంద్ర, ఇదయతుల్లా, శాంతాకుమారి, లోకేష్‌, పవన్‌కుమార్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని