logo

పీఏసీఎస్‌ ఉద్యోగుల వేతన సవరణకు డిమాండ్‌

జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక కమిటీ ద్వారా ఎలా వేతన సవరణ చేస్తున్నారో, అదే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) పని చేసే ఉద్యోగులకు చేయాలని ఏపీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పప్పు హరినాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 10 Jun 2023 05:34 IST

ఆప్కాబ్‌ కార్యాలయం ఎదుట ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ధర్నా

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక కమిటీ ద్వారా ఎలా వేతన సవరణ చేస్తున్నారో, అదే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) పని చేసే ఉద్యోగులకు చేయాలని ఏపీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పప్పు హరినాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడ గవర్నర్‌పేటలోని ఆప్కాబ్‌ కార్యాలయం ఎదుట సహకార పరపతి సంఘాల ఉద్యోగుల బదిలీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ 2014 ఏప్రిల్‌ 1 నుంచి జరగాల్సి ఉండగా, ఇంతవరకు అమలుకు నోచలేదన్నారు. సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బొల్లినేని రఘురాం మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు జీవో 36 ప్రకారం వేతన స్కేల్స్‌ అమలు చేయలేదన్నారు. వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం కార్యదర్శి నీలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీకి తాము వ్యతిరేకం కాదని, ఆర్థిక అంశాలపై సంఘాలతో చర్చించిన తరువాతే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర సహకార బ్యాంకు ఎండీ ఏకపక్షంగా 13 జిల్లాల ముఖ్య కార్యనిర్వహణాధికారులపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సహకార బ్యాంకుల ఉద్యోగుల సంఘం(ఏపీసీసీబీఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జన్యావుల రామాంజనేయులు, ఎస్‌.కొండలశర్మ, రామానాయుడు, చిరంజీవిరెడ్డి, అజామోహిద్దీన్‌, గోపాలకృష్ణారెడ్డి, కె.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని