logo

వైకాపాలో... ముసలం!

విజయవాడ నగర వైకాపాలో ముసలం మొదలైంది. ఇప్పటికే మధ్య నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఒకవైపు.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరోవైపు అనేలా పరిస్థితి ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలోనూ కొందరు కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

Published : 10 Jun 2023 05:34 IST

మేయర్‌, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పావులు
చైతన్యరెడ్డి, పుణ్యశీల రహస్య సమావేశాలు
ఈనాడు, అమరావతి - విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

​​​​​​​​​​​​​​​​​​​​​

విజయవాడ నగర వైకాపాలో ముసలం మొదలైంది. ఇప్పటికే మధ్య నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఒకవైపు.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరోవైపు అనేలా పరిస్థితి ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలోనూ కొందరు కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. చాలాకాలంగా పశ్చిమలో కొంతమంది కార్పొరేటర్లతో ఎమ్మెల్యేకు పొసగడం లేదు. ప్రధానంగా నగర మేయర్‌ పదవిని చాలామంది ఆశించగా.. వెలంపల్లి శ్రీనివాస్‌ చక్రం తిప్పి.. తనవర్గమైన రాయన భాగ్యలక్ష్మికి దక్కేలా చేసుకున్నారు. దీంతో మేయర్‌ పదవిని ఆశించి భంగపడిన చాలామంది.. అప్పటినుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం మేయర్‌ పదవీకాలం రెండేళ్లు దాటిపోవడంతో మళ్లీ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేయర్‌ పదవి కోసం తమకు మద్దతు ఇవ్వాలంటూ ఒక మహిళా కార్పొరేటర్‌ విందు ఏర్పాటు చేస్తే.. మరొకరు పశ్చిమ నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఓ మహిళా కార్పొరేటర్‌ రాజీనామా అస్త్రం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

విజయవాడలో 49 మంది కార్పొరేటర్లను గెలుచుకోవడంతో మేయర్‌ పదవి కోసం రెండేళ్ల కిందట ముగ్గురు తీవ్రంగా పోటీ పడ్డారు. కార్పొరేటర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బండి పుణ్యశీల, పి.చైతన్యరెడ్డి మేయర్‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ.. ఆ సమయంలో మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌ చక్రం తిప్పి అనూహ్యంగా తన వర్గమైన రాయన భాగ్యలక్ష్మి పేరును తెరపైకి తెచ్చారు. వెలంపల్లి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి భాగ్యలక్ష్మి భర్త రాయన నరేంద్ర ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆమెను మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టారు. దీంతో మేయర్‌ పదవి కోసం పోటీపడిన ముగ్గురు మహిళా కార్పొరేటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారికి ఉపశమనం కలిగించేలా రంగంలోకి దిగిన వైకాపా పెద్దలు.. అవుతు శ్రీశైలజారెడ్డికి రెండో ఉపమేయర్‌ పదవి ఇచ్చారు. పుణ్యశీలకు ఏపీ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. చైతన్యరెడ్డికి మాత్రం ఎలాంటి పదవి దక్కకకపోవడంతో ఆమె అప్పటినుంచి వెలంపల్లి వర్గానికి దూరంగానే ఉన్నారు. కార్పొరేటర్‌గా గెలిచిన కొత్తలో ప్రతి కార్యక్రమంలో ముందుండే చైతన్యరెడ్డి.. తర్వాత.. అంటీముట్టనట్లు ఉన్నారు. చివరికి కార్పొరేటర్‌ కార్యాలయానికి, మేయర్‌ ఛాంబరుకు కూడా ఎప్పుడో తప్ప వచ్చింది లేదు.

పట్టుకోసం ప్రయత్నాలు

వచ్చే ఎన్నికల్లో వైకాపాలో తాను పశ్చిమ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించాలని చైతన్యరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికోసం వైకాపాకు చెందిన సీనియర్‌ మంత్రి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈవిషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలంపల్లి కూడా ఆమెను దూరం పెట్టినట్టు ఆయన వర్గం చెబుతోంది. ఇదే సమయంలో చైతన్యరెడ్డి కొంతకాలంగా తన వర్గం నాయకులు, కార్యకర్తలతో రహస్య సమావేశాలు పెడుతూ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలోనే రెండుసార్లు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశాలను రహస్యంగా చిత్రీకరించి ఎమ్మెల్యేకు ఒక నాయకుడు పంపారని సమాచారం. ఇటీవల భవానీపురం క్రాంబేరోడ్డు, రైతుబజారు, జిల్లా వైకాపా కార్యాలయం సమీపంలో కొద్దికాలం కిందట చైతన్యరెడ్డి ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, కటౌట్లు, బ్యానర్లు, ప్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు పీకేశారు. ఇదికూడా ఎమ్మెల్యే వర్గీయుల పనే అని ఆమె వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె రాజీనామా అస్త్రం వాడారని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ.. అలాంటిదేమీ లేదని తాజాగా చైతన్యరెడ్డి వెల్లడించినా.. అంతర్గతంగా వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందని వైకాపా శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. చివరికి ఆమె రాజీనామా చేసిందనే విషయాన్ని కూడా కొంతమంది వైకాపా నేతలే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం గమనార్హం.

మద్దతు కోసం ఆరాటం...

ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మేయర్‌ పదవి తనకే ఇస్తారని కార్పొరేటర్‌ పుణ్యశీల చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అనూహ్యంగా రాయన భాగ్యలక్ష్మి తెరపైకి రావడంతో పుణ్యశీల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరికి జగన్‌ వద్దకు కూడా పంచాయితీ చేరింది. చివరికి ఏపీ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కడంతో కొంత ఊరట లభించింది. కానీ.. కార్పొరేటర్‌గా, ఏపీ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రెండుచోట్లా గౌరవవేతనం పొందడం వివాదమైంది. కార్పొరేటర్‌ పదవిపై అనర్హతవేటు వేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గత సెప్టెంబరులో నగరపాలక సంస్థకు లేఖ రాశారు. దీనివెనుక ఎమ్మెల్యే వెలంపల్లి, మేయర్‌ భాగ్యలక్ష్మి హస్తం ఉందని పుణ్యశీల భావించి.. అదే సమయంలో దుర్గగుడికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ వద్ద తన ఆవేదన బయటపెట్టారు. ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తానని, తనకు ఇచ్చిన హామీ ప్రకారం మేయర్‌ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను అంతా చూసుకుంటాననీ, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని జగన్‌ హామీ ఇచ్చారు. అప్పటినుంచి పుణ్యశీల కూడా కార్పొరేటర్‌ కార్యాలయానికి, మేయర్‌ ఛాంబరుకు పెద్దగా రావడం లేదు. కౌన్సిల్‌ సమావేశాల్లోనూ చురుకుగా పాల్గొనడం లేదు. తాజాగా పుణ్యశీల తన పుట్టినరోజు సందర్భంగా పలువురు వైకాపా కార్పొరేటర్లకు విందు ఏర్పాటు చేసి.. మేయర్‌గా తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని