logo

పోరు ఆగనివ్వం.. అరచకం సాగనివ్వం

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెదేపా, జనసేన కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు ఉద్ధృతం చేశారు.

Updated : 18 Sep 2023 05:22 IST

చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనలు

పెనమలూరు: బోడే ప్రసాద్‌, తెదేపా, జనసేన నాయకుల నిరసన

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెదేపా, జనసేన కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు ఉద్ధృతం చేశారు. రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు విడుదలయ్యేంత వరకు ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. అయిదో రోజు ఆయా మండలాల్లో నిరసన ప్రదర్శనలు, దేవాలయాల్లో పూజలు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. మహిళలు నల్ల చీరలు ధరించి నిరసన తెలిపారు. నల్లబెలూన్లు ఎగురవేసి, జలదీక్షలు చేసి, మోకాళ్లపై నడిచి, పాదయాత్రలు నిర్వహించి, సైకిల్‌ యాత్రలు చేసి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలీసులు అనుమతించకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈనాడు, అమరావతి: జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరులో నిరసనలు కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలో తోట్లవల్లూరు మండలం, పమిడిముక్కల మండలంలో దీక్షలు నిర్వహించారు. అవనిగడ్డ, పెడన, బందరులోనూ దీక్షలు కొనసాగాయి. గుడివాడలో రెండు శిబిరాల్లో దీక్షలు నిర్వహించారు. గన్నవరంలోనూ అయిదో రోజు నిరసనలు కొనసాగాయి. అవనిగడ్డ దీక్షా శిబిరంలో జనసేన ఐటీ విభాగం కోఆర్డినేటర్‌ నందగోపాల్‌ ప్రసంగించారు. నల్లకండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉప్పులూరు, ఈడుపుగల్లు గ్రామాల్లోనూ దీక్షా శిబిరాలు నిర్వహించి నిరసన తెలిపారు.  

చర్చిల్లో ప్రార్థనలు...

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు క్షేమంగా, త్వరగా విడుదల కావాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలో ప్రార్థనా మందిరాల(చర్చి)లో పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. తెదేపా, జనసేన కార్యకర్తలు చర్చిలకు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. గుణదల మేరీ మాత మందిరంలో గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. తిరువూరు మండలం గానుగపాడులో సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు జరిగాయి. విస్సన్నపేట సీఎస్‌ఐ చర్చిలో జనసేన, తెదేపా కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు. రాజుగూడెం చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఇస్లాంపేటలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేశారు.

దేవాలయాల్లో పూజలు...

ఆదివారం పలు దేవాలయాల్లో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నందిగామ మండలం అంబారుపేట నుంచి పరిటాల వరకు మహిళలు పాదయాత్ర నిర్వహించారు. కంకిపాడులో దేవాలయాల్లో పూజలు చేశారు. ప్రసాదంపాడులో మహిళలు భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గన్నవరంలో నల్లచీరలతో నిరసన తెలిపారు. ఏకొండూరులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పిల్లి సురేంద్రబాబు ఆధ్వర్యంలో దళితులు జలదీక్ష నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు