logo

‘పదవీ కాలం పూర్తయినా వేధిస్తున్నారు’

ఏపీ ఉర్దూ అకాడమీ మాజీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ తన పదవీ కాలం పూర్తయినా, ఇప్పటికీ కార్యాలయంలోనే ఉంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పనిచేసే ఉద్యోగులు వాపోయారు.

Published : 21 Sep 2023 04:51 IST

ఉర్దూ అకాడమీ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన

విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే: ఏపీ ఉర్దూ అకాడమీ మాజీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ తన పదవీ కాలం పూర్తయినా, ఇప్పటికీ కార్యాలయంలోనే ఉంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పనిచేసే ఉద్యోగులు వాపోయారు. మాజీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌కు వ్యతిరేకంగా విజయవాడ భవానీపురం హెచ్‌బీ కాలనీలోని కార్యాలయం వద్ద ఉద్యోగులు బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. మాజీ ఛైర్మన్‌ కార్యాలయానికి రాగా నిలదీశారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఉద్యోగి మహ్మద్‌ ఉమర్‌ మాట్లాడుతూ మాజీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జులై 28తో పూర్తయిందన్నారు. అయినా ఆయన కార్యాలయానికి వచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలిపారు. అకాడమీలో 15 నుంచి 35 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ సర్వీసుకు తగినట్లు జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ అకాడమీలో రాష్ట్ర వ్యాప్తంగా 167 మంది ఉద్యోగులు పని చేస్తున్నామని, రెండేళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెట్టారన్నారు. కొందరు ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే మాజీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు పలుకుబడి ఉందని, ఉద్యోగులను ఏమైనా చేస్తానని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఆయన ఒక డైరెక్టర్‌ను, సూపరింటెండెంట్‌ను కార్యాలయానికి తెప్పించుకున్నారని, వారి పదవీ కాలం కూడా పూర్తి కావొచ్చాయని తెలిపారు. తమ సమస్యలను డిప్యూటీ సీఎం, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే డైరెక్టర్‌, సూపరింటెండెంట్‌లు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన నదీమ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కొందరు ఉద్యోగులపై కేసులు ఉన్నాయని, వాటివల్లే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. తన పదవీ కాలం పూర్తయినప్పటికీ పొడిగింపు ఉత్తర్వులు వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని