logo

పాలన చేతకాకే ప్రతిపక్ష నాయకులపై కేసులు: దేవినేని

మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై సీఎం జగన్‌ అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 21 Sep 2023 05:13 IST

దీక్షా శిబిరంలో మాజీ మంత్రి ఉమా, మాజీ ఎమ్మెల్యే సౌమ్య తదితరులు

నందిగామ, న్యూస్‌టుడే: మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై సీఎం జగన్‌ అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ... బుధవారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో రిలే దీక్ష చేపట్టిన నాయకులకు నిమ్మరసం ఇచ్చి ఉమా దీక్షను విరమింపజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శ్రీలంక అధ్యక్షుడిపై ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగానే సీఎం జగన్‌పై జనం తిరగబడతారని అన్నారు. పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనేక దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయడం ఇదే మొదటి సారని అన్నారు. దసరా తర్వాత విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానని సీఎం ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్న సీఎంకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అక్రమ కేసుల్లో నారా లోకేష్‌, ఇతర నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రిగా లోకేష్‌ అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేయించారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల సీఎం ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా వేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. త్వరలో చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటికి వస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలుకు పంపించిన జగన్‌ను జనం తరిమికొడతారని అన్నారు. నాయకులు వీరంకి వీరాస్వామి, యేచూరి రామకృష్ణ, కాసర్ల లక్ష్మీనారాయణ, పులవర్తి నరసింహారావు, మనమోతుల శ్రీరామ్‌, దాసరి సత్యం, వడ్డెల్లి సాంబశివరావు, షేక్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని