logo

ఇళ్లు ఇప్పిస్తానని మోసం

కబేళా సెంటర్‌లో నగరపాలక సంస్థ నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..

Published : 21 Sep 2023 04:59 IST

10 మంది వద్ద రూ.19 లక్షల వసూలు
వీఎంసీ అధికారుల సంతకాలతో రశీదులు

చిట్టినగర్‌, న్యూస్‌టుడే : కబేళా సెంటర్‌లో నగరపాలక సంస్థ నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపేట, పైలావారి వీధికి చెందిన జిల్లెల్ల రామారావు ప్లాస్టిక్‌ వ్యాపారం చేస్తాడు. తనతో పాటు ప్లాస్టిక్‌ వ్యాపారం చేసే కోటి ద్వారా ఆర్‌ఎంపీగా పని చేసే మస్తాన్‌ పరిచయమయ్యాడు. అతనికి నగరపాలక సంస్థలో పెద్ద పెద్ద అధికారులు తెలుసని చెప్పాడు. కబేళా సెంటర్‌ వద్ద జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లు తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి డబ్బులు చెల్లిస్తే ఇప్పిస్తానని అన్నాడు. అందుకు రూ.3.50 లక్షల వరకు అవుతుందని మస్తాన్‌ రామారావుకు చెప్పాడు. నిజమేనని నమ్మి మస్తాన్‌కి మొదటిగా రూ.50 వేలు, రెండోసారి రూ.66,000లు చెల్లించాడు. 2021 అక్టోబరు 20వ తేదీన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, బీఎస్‌యూపీ లబ్ధిదారులకు సమాచార లేఖను ప్రాజెక్టు మేనేజర్‌, హౌసింగ్‌ సేల్‌ సంతకంతో కూడిన రశీదు రామారావుకు ఇచ్చాడు. అందులో రామారావు లబ్ధిదారుడని పొందుపరచి ఉంది. కట్టిన డబ్బులకు గ్యారెంటీ ఏంటని మస్తాన్‌ అడిగితే పాతరాజరాజేశ్వరీపేటలోని జేపీ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే షకీలా అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లి ఈమె ద్వారానే ఇళ్లు వస్తాయని ఆమెను పరిచయం చేశాడు. ఆమె రామారావుతో మీకు తప్పకుండా ఇల్లు వస్తుందని చెప్పింది. అనుమానం వచ్చి ఈ విషయమై నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి విచారించగా మస్తాన్‌, షకీలా  మోసం చేశారని తెలిసింది. మిగతా డబ్బులు ఎంత తొందరగా చెల్లిస్తే అంత తొందరగా ఇళ్లు వస్తాయని, డబ్బులు కట్టమని ఒత్తిడి చేశారు. రామారావుతోపాటు అతని అత్త పుష్పలత తెలిసిన వారైన యోగి, జానకీరావు, జాన్‌పాల్‌, మరికొంత మంది గృహాల కోసం డబ్బులు చెల్లించారు. ఇళ్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసగించిన మస్తాన్‌, షకీలాపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు రామారావు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరిద్దరు ఇళ్లు ఇప్పిస్తామని 10 మంది వద్ద సుమారు రూ.19 లక్షల మేర వసూలు చేసి మోసం చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని