జగన్ అవినీతి చిట్టా విప్పుతాం : బొండా
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి చిట్టాను ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో విప్పుతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు. పక్కనే నవనీతం సాంబశివరావు, జయరాజు
మొగల్రాజపురం (చుట్టుగుంట), న్యూస్‌టుడే : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి చిట్టాను ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో విప్పుతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. 18 కేసుల్లో ముద్దాయిగా రూ.43వేల కోట్లు దిగమింగి 11 సీబీఐ, ఏడు ఈడీ కేసుల్లో ప్రజాధనాన్ని దిగమింగిన జగన్‌మోహన్‌రెడ్డి.. నిజస్వరూపాన్ని అసెంబ్లీ సాక్షిగా మీడియా సమక్షంలో ప్రజలందరికీ కూడా వివరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో వైకాపా ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై చర్చించాల్సింది పోయి, చంద్రబాబునాయుడిని ప్రజల మన్ననల నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ వేయడం సిగ్గుమాలిన పని అన్నారు. నాలుగున్నరేళ్లలో ఇసుక, మైనింగ్, మద్యం దోపిడీ, కార్పొరేషన్ల నిధులు దారి మళ్లింపు.. వంటి వాటిని తాము ‘ఐనాక్స్’లో చూపిస్తామని దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది అని, 18 నెలలు జైల్లో ఉండడం వల్ల మానసిక రోగిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. ఇక వైకాపా ప్రభుత్వం ఇంటి దారి పట్టడం ఖాయమని పేర్కొన్నారు. 21 పార్లమెంటు, 160 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా గెలుస్తుందని ఐపాక్ సర్వే చెప్పడంతో.. జగన్‌మోహన్‌రెడ్డికి మింగుడు పడటం లేదన్నారు. అందుకే నారా చంద్రబాబునాయుడుని ఇబ్బందిపెట్టి, ప్రజలకు దూరం చేయాలనే దుర్దేశంతో వైకాపా నాయకులు అకృత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కానీ వాటి వల్ల చంద్రబాబునాయుడికి, తెదేపాకి ప్రజలు మరింత చేరువవుతున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా మేధావులు, విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ.. చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని వివరించారు. ఈ ప్రజా ఉద్యమమే రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి చరమ గీతం పాడడానికి నాంది అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు న్యాయస్థానాలపై గౌరవం ఉందని, న్యాయస్థానం పరంగా రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తామని ఉమా పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, దాసరి జయరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.