logo

కళాశాల నిర్మాణానికి కాసుల కొరత

కంచికచర్లలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం విద్యార్థినులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

Updated : 21 Sep 2023 06:09 IST

మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్లలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం విద్యార్థినులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కళాశాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇప్పటివరకు కళాశాలకు అడ్డంకిగా మారిన స్థల సమస్య తొలగిపోయినా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభించడం లేదు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి జూనియర్‌ కళాశాల నుంచి 10 ఎకరాలు అప్పగించి ఆరు నెలలు గడిచిపోయింది. కళాశాల నిర్మాణం మాత్రం కలగానే మిగిలిపోయింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదవాలంటే ఆర్థిక భారం అవుతోందని, ప్రభుత్వ కళాశాల ఏర్పాటైతే నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చని విద్యార్థినులు భావిస్తున్నారు. విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడే కళాశాల నిర్మాణానికి నిధుల మంజూరులో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. కళాశాల ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆధునిక వసతులతో..

సుమారు రూ.20 కోట్లతో కంచికచర్లలో మహిళా డిగ్రీ కళాశాల నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఆధునిక వసతులతో కూడిన తరగతి గదులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. కళాశాల నిర్మాణం పూర్తయితే పీజీతో పాటు కొత్త కోర్సులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ, కైకలూరు, అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, బంటుమిల్లి, తిరువూరు, మైలవరం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కంచికచర్లలో కళాశాల ఏర్పాటైతే గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఉన్నత విద్య చదివే అవకాశం కలుగుతుంది. వసతి సౌకర్యం ఉండటంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల పేద విద్యార్థినులకు ఉపయుక్తంగా ఉంటుంది. వాస్తవానికి 2013లోనే కంచికచర్లకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరైంది. అప్పట్లో భూముల ధరలు అధికంగా ఉండటం, మరికొన్ని కారణాలతో కంచికచర్లలో కళాశాలకు స్థలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో కంచికచర్లకు మంజూరైన కళాశాలను ప్రస్తుతం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌, సీవీఆర్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి కంచికచర్లలో కళాశాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చడం లేదు.


నిధులు ఇవ్వాలని కోరాం
- వల్లూరు నీరజ, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌

కంచికచర్లలో కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక బడ్జెట్‌ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాం. జూనియర్‌ కళాశాల నుంచి 10 ఎకరాలు అప్పగించడంతో తరగతి గదుల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. రూ.20 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో...ఆధునిక సౌకర్యాలతో కళాశాల భవనాలు నిర్మించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యేలోపు తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో కళాశాల నడిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని