రెండు మండలాలను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేలా ప్రణాళిక
ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల(బ్లాక్స్)ను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు వివరించారు.
కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల(బ్లాక్స్)ను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు వివరించారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంపై బుధవారం దిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ డిల్లీరావు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఈ నెల 30న దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్ప సత్తాహ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, ప్రగతి మైదాన్ నుంచి ఈ పథకంపై సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు మండలాల్లో నీతిఆయోగ్ నిర్దేశించిన విధివిధానాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన రెండు బ్లాక్‌లు అభివృద్ధి చెందిన అర్బన్ బ్లాక్‌ల దగ్గరగా ఉన్నందున, అత్యుత్తమ బ్లాక్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 9 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల వద్ద ఇమ్యునైజేషన్ డ్రైవ్, పరీక్షలు చేసి రక్తహీనత శాతాన్ని పరిశీలించడం, నిక్షయ్ మిత్ర కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 4న అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ మేళా నిర్వహించి చిన్నారుల ఆరోగ్య ఎదుగుదలను పరిశీలిస్తామని చెప్పారు. 5న గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 6న పంచాయతీ భవనంలో వర్క్ షాపులు, సదస్సులు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ ప్రదర్శనలు, ఫార్మా టు టేబుల్ ఫుడ్ ఫెస్టివల్, గోబర్ ధన్, బయో వ్యవసాయ వనరులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 7న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ అక్షరాస్యతపై వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. 8న విశ్వకర్మ పథకంపై అవగాహన, డిజిటల్ మార్కెటింగ్‌పై శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత, ఈ-కామర్స్ కార్యక్రమాలు, 9న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, ఉత్తమ అభ్యాసాలు, కార్యాచరణ కియోస్క్‌లు, ఉత్తమ ఫీల్డ్ పంక్షనరీలకు బహుమతుల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు నీతిఆయోగ్ అధికారులకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.