logo

సంక్షేమ శాఖలో... అవినీతి గద్దలు..!

విజయవాడ శివారులో ఈనెల 7న రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు మాంసాహారం (చికెన్‌సూప్‌, చికెన్‌ బిర్యానీ, చికెన్‌ స్టాటర్‌) తినేసి వసతిగృహ వార్డెన్‌కు బిల్లు కట్టమని ఇచ్చిన ఆదేశాలివి.

Published : 21 Sep 2023 05:18 IST

పేద పిల్లల కడపు మాడ్చి.. అధికారుల విలాసానికి...
యాచన కంటే హీనంగా ఉందని వార్డెన్ల అసహనం
ఈనాడు, అమరావతి

‘మేము సమావేశానికి వచ్చాం. ఇక్కడ ఒక హోటల్‌లో భోజనాలు చేశాం. బిల్లు రూ.1845 అయింది. వెంటనే ఫోన్‌పే చేయండి..!’

విజయవాడ శివారులో ఈనెల 7న రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరైన సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు మాంసాహారం (చికెన్‌సూప్‌, చికెన్‌ బిర్యానీ, చికెన్‌ స్టాటర్‌) తినేసి వసతిగృహ వార్డెన్‌కు బిల్లు కట్టమని ఇచ్చిన ఆదేశాలివి.

  • ఆమె సంక్షేమ శాఖలో డివిజను స్థాయి అధికారిణి. శ్రావణమాసం పూజలు ఇంట్లో చేసేందుకు పూలు, ఇతర సామగ్రి కావాలి. మొత్తం కలిపి రూ.2వేలు మించవు. ఓ సంక్షేమ వసతిగృహం అధికారికి అప్పగించారు. అంతే ఆయన తెచ్చి ఇంట్లో ఇచ్చారు.

ప్రతి వసతిగృహం నుంచి నెలకు రూ.5వేలు ఠంచనుగా అందాల్సిందే. లేదంటే తనిఖీలు వేధింపులు, సస్పెన్షన్‌లు.. ఇదీ ఆ అధికారి తీరు. ఓ జిల్లా స్థాయి, డివిజను స్థాయి అధికారులు కలిసి సంక్షేమశాఖ వసతి గృహ వార్డెన్‌లను పీడిస్తున్నారు. అసలే అత్తెసరు బడ్జెట్‌తో విద్యార్థులకు అరకొర భోజనం వడ్డిస్తున్న వార్డెన్‌లు.. వీరి మామూళ్ల దాహానికి విద్యార్థులకు మరింత కడుపు మాడుస్తున్నారు. గతంలో విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా హాజరు చేర్చి మెనూ ఛార్జీలు తీసుకొనేవారు. ఖర్చు చూపించేవారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు ప్రతి రోజూ బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవాల్సి ఉంది. ఉదయం అల్పాహారం, భోజనం స్నాక్స్‌ ఇతర మెనూ అంతా బయోమెట్రిక్‌ హాజరు బట్టి తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో గతంలో లాగా వసతిగృహాల అధికారులకు ప్రస్తుతం మిగలడం లేదంటున్నారు. నాలుగో తరగతి లోపు విద్యార్థులకు నెలకు రూ.1150, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1400, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రూ.1600 చొప్పున మెనూ ఛార్జీలు అందిస్తున్నారు. రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.38.33, రూ.46.67, రూ.53.33 చొప్పున భోజనానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక భోజనం బయట మార్కెట్‌లో రూ.100 ఉంటుంది. మినీ భోజనం (ప్లేట్‌) రూ.80 వరకు ఉంటుంది. కానీ ఈ ఖర్చుతో మూడు పూటలు పెట్టాలి. దీనికి పండ్లు, గుడ్లు, ఇతర చిరుతిళ్లు అదనం. వీటితో వసతిగృహం నిర్వహణ కష్టంగా మారుతోంది. ప్రభుత్వం ఇచ్చే బియ్యం కావడంతో అన్నం బాగోడం లేదు.

జిల్లాలో బీసీ వసతి గృహాలు 43

విద్యార్థులు 1635


ఫిర్యాదు చేస్తారనే బెరుకూ లేదు...

ప్రతి నెలా ఒక వసతిగృహం నుంచి రూ.10వేలు డివిజను స్థాయి అధికారికి ఇవ్వాలని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో మరో రూ.5వేలు ఇవ్వాలని వార్డెన్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.15వేల వరకు వారికే సమర్పించాల్సి ఉంటుంది. ఇవికాకుండా అధికారులు పర్యటనలకు వచ్చిన సమయంలో వారి ఖర్చు, వారి వెంట వచ్చిన వారి ఖర్చు, మర్యాద ఖర్చులు అన్నీ భరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాట్సప్‌ సందేశాలు ఇస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే బెరుకు కూడా లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఓ అధికారి, ఓ డివిజన్‌ అధికారిణి ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తారు. వారి ఖర్చు మొత్తం ఆయా పరిధిలోని వార్డెన్లు భరించాలట. ఈ శాఖలో కృష్ణా జిల్లాలో మొత్తం 43 వసతిగృహాలు ఉన్నాయి. ఒక నెలకు వసూలు రూ.6.5లక్షల వరకు ఉంటుంది. ఇతర మర్యాద ఖర్చులు కాకుండా ఇవి డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులకు నెలనెలా సమర్పించే మామూళ్లు. ఎన్టీఆర్‌ జిల్లాలో 28 వసతిగృహాలు ఉన్నాయి. దాదాపు రూ.4.2లక్షలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇక అధికారుల పర్యటనలే కాదు.. స్థానిక నాయకులు అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేసినా వాటి ఖర్చు వీరికి కొంత పడుతుంది.


ఎన్నికల నిర్వహణ సందర్భంగా మండలాల్లో పర్యటించిన సమయంలో ఓ అధికారి వాహనానికి ఇంధన ఖర్చుల కింద ఒక్కో వార్డెన్‌ నుంచి రూ.2వేల చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మామూళ్లు ఇవ్వకపోతే బిల్లుల్లో కొర్రీలు వేసి సకాలంలో మంజూరు చేయడం లేదు. ఆ అధికారికి మెజిస్ట్రేట్‌ హోదా లేకపోయినా.. సైరన్‌ మోగిస్తూ.. తన వాహనంతో తనిఖీకి మండల కార్యాలయాలకు వెళ్తుంటారు. వీరికి కొంత మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది. వారికి మర్యాద పేరుతో వార్డెన్‌లపైనే పడుతున్నారు.


లోటు పూడ్చుకునేందుకు అడ్డదారులు...

జిల్లా స్థాయిలో కాంట్రాక్టరు ద్వారా వచ్చే కొబ్బరి నూనె, ఇతర కాస్మోటిక్స్‌ పక్కదారి పడుతున్నాయి. లేదా వసతిగృహం స్థాయిలో కొనుగోలు చేసే వాటిలో కోత వేస్తున్నారు. ప్రతి విద్యార్థికి కాస్మొటిక్స్‌ కింద నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ఇక హెయిర్‌ కటింగ్‌ ఛార్జీలు అసలే ఇవ్వరు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినప్పుడే చేయించుకుంటారు. ఓ జిల్లాలోని ఇద్దరు అధికారుల తీరు మరీ యాచకుల తరహాలో ఉందని, ఒక్క రోజు ఆలస్యమైనా ఫోన్‌ చేస్తున్నారని ఓ వార్డెన్‌ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపు మాడ్చి ఈ అవినీతి గద్దలకు పెట్టాల్సి వస్తోందని పలవురు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని