logo

3 ఎకరాలు 4 ప్రాణాలు

మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో మరోమారు ఫ్యాక్షన్‌ కక్షలు భగ్గుమన్నాయి. కుటుంబంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో గురువారం పట్టపగలు నడిరోడ్డుపై దంపతులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

Updated : 22 Sep 2023 08:49 IST

నాలుగేళ్ల వ్యవధిలో తండ్రి, తమ్ముడు హతం
కక్షతో పెదనాన్న, పెద్దమ్మను మట్టుబెట్టిన సోదరుడి కుమారులు

వివరాలు ఆరా తీస్తున్న డీఎస్పీ శ్రీకాంత్‌

‘‘కన్న తండ్రిని.. సొంత తమ్ముడిని.. ఆస్తి కోసం అన్న.. అతి కిరాతకంగా మట్టుబెట్టాడు. కళ్లెదుటే జరిగిన దారుణం నుంచి తేరుకొని తమ్ముడి భార్య, అతడి పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. బతుకు జీవుడా అని ఏళ్లకు ఏళ్లు... ఊళ్లకు ఊళ్లు మారుతూ.. అయినవారి కంటపడకుండా బతికి బట్టకట్టారు. పెరిగిన పిల్లలతోపాటే.. వారిలో కక్ష కూడా పెరిగింది. తమకు జరిగిన అన్యాయంపై కసితో రగిలారు.. ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగొచ్చిన వారు... నిమిషాల వ్యవధిలో కత్తి దూశారు. పెదనాన్న, పెద్దమ్మలను కడతేర్చి పరారయ్యారు. ఆప్తుల కన్నా.. ఆస్తులే మిన్నయని తలచిన వేళ.. 3 ఎకరాల కోసం.. 4 నిండు ప్రాణాలు బలయిన దారుణమిది..’’

వీరకృష్ణ, వరలక్ష్మి (పాత చిత్రాలు)

అయ్యంకి (కూచిపూడి): మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో మరోమారు ఫ్యాక్షన్‌ కక్షలు భగ్గుమన్నాయి. కుటుంబంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో గురువారం పట్టపగలు నడిరోడ్డుపై దంపతులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో వీరంకి చినఆంజనేయులు కుటుంబంలో ఆస్తి వివాదంతో ఏళ్ల తరబడి ఫ్యాక్షన్‌ కక్షలు రగులుతున్నాయి.

వీరంకి చిన ఆంజనేయులు.. కుమారులు వీరకృష్ణ, పూర్ణచంద్రరావు. వీరు వివాహాలు చేసుకొని వేర్వేరుగా జీవిస్తున్నారు. ఆస్తి పంపకాల విషయంలో 2008లో చినఆంజనేయులును అతడి పెద్ద కుమారుడు వీరకృష్ణ నరికి చంపేశాడు. తర్వాత 2012లో సోదరుడు పూర్ణచంద్రరావుని కూడా నడిరోడ్డుపై హతమార్చాడు. ఆ సమయంలో పూర్ణచంద్రరావు భార్య స్వర్ణ.. తన కుమారులు గణేష్‌, లోకేష్‌, భువనేష్‌లతో పారిపోయారు. కొంతకాలం చల్లపల్లి సమీపంలో నడకుదురు, అక్కడి నుంచి అవనిగడ్డ, అనంతరం రేపల్లెలో తలదాచుకున్నారు. తమ తండ్రిని పెదనాన్నే హత్య చేశాడనే కోపంతో ఎలాగైనా అతడ్ని హతమార్చాలని పూర్ణచంద్రరావు కుమారులు గణేష్‌, లోకేష్‌, భువనేష్‌ పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో చినఆంజనేయులుకు ఉన్న 3.01 ఎకరాల పొలాన్ని పూర్ణచంద్రరావు భార్య, కుమారులు తమ పేరున రాయించుకొని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం మొవ్వ తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు మాత్రం తిరిస్కరిస్తూ వస్తున్నారు.

కత్తి దూసిన కలహం... ఈ నేపథ్యంలో స్వర్ణ తన కుమారులతో కలిసి గురువారం అయ్యంకిలో వీఆర్వో కార్యాలయానికి వచ్చి పట్టాదారు పాసుపుస్తకాలు అడిగారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాక వాస్తవాలు నిర్ధారించుకొని ఇస్తామని వీఆర్వో గోపి, ఆర్‌ఐ విజయలక్ష్మి చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న వీరకృష్ణకు, అతడి సోదరుడి భార్య స్వర్ణకు మధ్య గొడవ చోటుచేసుకుంది. అప్పటికే పక్కా ప్రణాళికతో వచ్చిన స్వర్ణ కుమారులు ముగ్గురు కలిసి వారి పెదనాన్న వీరకృష్ణ (55)ను పంచాయతీ కార్యాలయం ఆవరణలోని వీఆర్వో కార్యాలయం ఎదుట, వీరకృష్ణ భార్య వరలక్ష్మి (44)ని కూచిపూడి - పామర్రు ఆర్‌అండ్‌బీ ప్రధాన దారిపై కత్తులతో పాశవికంగా నరికి చంపేశారు. వీరకృష్ణ కుమారుడు దుర్గారావు లారీ డ్రైవర్‌గా డ్యూటీలో ఉన్నాడు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్‌, పామర్రు సీఐ వెంకటనారాయణ, కూచిపూడి ఎస్‌ఐ సందీప్‌ సిబ్బందితో వచ్చి సంఘటనా ప్రదేశాలను పరిశీలించారు. ఈ జంట హత్యకు పాత కక్షలు, ఆస్తి గొడవలే కారణమని వెల్లడించారు. దుండగులు పరారవగా... నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. హత్యకు గురైన దంపతుల మృతదేహాలను శవ పరీక్ష కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని