logo

తీసుకుంటాం.. తిరిగివ్వం..!

  రాష్ట్ర ప్రభుత్వం... ‘యాగం’ చేసినా.. ‘స్వాతంత్య్ర వేడుకలు’ నిర్వహించినా.. పేదలకు పట్టాలు పంపిణీ చేసినా.. సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు చేపట్టినా..

Updated : 23 Sep 2023 06:23 IST

ప్రతిసారీ... కార్పొరేషన్‌ నెత్తిన భారం
ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పని ఖర్చు
తప్పించుకుంటున్న కీలక శాఖలు..

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే :   రాష్ట్ర ప్రభుత్వం... ‘యాగం’ చేసినా.. ‘స్వాతంత్య్ర వేడుకలు’ నిర్వహించినా.. పేదలకు పట్టాలు పంపిణీ చేసినా.. సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు చేపట్టినా.. ఆయా సందర్భాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు అయ్యే రూ.లక్షల వ్యయాన్ని కార్పొరేషన్‌ నెత్తిన మోపుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల ఖర్చులు, భారం మోయాల్సిన కీలక శాఖలు కిమ్మనకుండా కూర్చుంటే.. గత్యంతరం లేక నగరపాలక సంస్థే ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునే విషయంలో పాలకులు సాహసం చేయలేక చతికిలబడుతున్న దయనీయమిది. ఈ స్థితిలో నగరపాలక సంస్థ సాధారణ నిధులు వెచ్చించే పద్దులకు ఆమోదముద్ర వేస్తున్నారు.

‘‘మే 12-17 మధ్యన నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడాప్రాంగణంలో అష్టోత్తర శత (108) కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ప్రభుత్వం తరఫున నిర్వహించారు. సీఎం జగన్‌ యజ్ఞసంకల్పం చేయగా, 17న పూర్ణాహుతితో యాగం ముగిసింది. ఈ క్రతువుకు నగరపాలక ఖజానా నుంచి రూ.45.16 లక్షలు ఖర్చుపెట్టి 18 రకాల పనులు చేశారు. క్రీడాప్రాంగణంలో వ్యర్థాల తొలగింపునకు జేసీబీలు, ట్రాక్టర్లు వంటివి అద్దెకు తేవడం మొదలు క్రీడాప్రాంగణం చదునుకు డోజర్లు, రోడ్డు రోలర్లను అద్దెకు తెచ్చే వరకు రూ.3.49 లక్షలు ఖర్చుపెట్టారు. ఇక క్రీడాప్రాంగణం ప్రధాన ద్వారాల వద్ద బోర్డుల ఏర్పాటు, గోడలకు రంగులు, ప్రాంగణంలో యూజీడీ పైపుల అమరిక, యాగానికి వచ్చిన ముఖ్యులు, భక్తుల కోసం కూలింగ్‌ యంత్రాలు, ఆర్వో ప్లాంట్లకు ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, హెచ్‌డీపీఈ పైపులైన్లు, తాగునీటి కూలింగ్‌ క్యాన్లు, ఐరన్‌టేబుళ్ల ఏర్పాటు.. సరఫరా, వాటి అద్దెలు, ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు రూ.4.89 లక్షలు వెచ్చించారు. చిత్రంగా వాటర్‌ క్యాన్లు, నీటిసరఫరా, నీటిబుడగలు, స్టిక్కర్లు వంటివి కొనుగోళ్ల పేరిట మరో రూ.8.07 లక్షలు వెచ్చించారు. యాగానికి హాజరైన వారికి శీతల పానీయాలు, చల్లటి నీటి సరఫరా, ప్రైవేటు సిబ్బందికి రోజువారీ వేతనాలకు రూ.3.8 లక్షలు ఖర్చుచేశారు. మరోవైపు వాటర్‌ ప్యాకెట్లు, పేపర్‌గ్లాసులు, ఇతరాలకు రూ.4.07 లక్షలు వెచ్చించారు.

ఇక అయ్యాక చూడాలి..!

యాగం పూర్తయ్యాక క్రీడాప్రాంగణం శుభ్రం, లెవలింగ్‌కు పాలిక రూ.1.69 లక్షలు ఖర్చుచేసింది. క్రతువు ముగిశాక చూస్తే.. అంతకు ముందే వేసిన యూజీడీ పైపులన్నీ పగిలిపోయాయి. మళ్లీ వాటి అమరిక, మరమ్మతులకు రూ.4.02 లక్షలు వదిలింది. సూర్యారావుపేట సీవీఆర్‌ స్కూలు, బాస్కెట్‌బాల్‌ ప్రాంగణాల్లోని క్రీడా, ఇతర సామగ్రిని ఇందిరాగాంధీ క్రీడాప్రాంగణంలోకి తిరిగి తెచ్చేందుకు రూ.1.95 లక్షలు వెచ్చించారు.

స్వాతంత్య్ర వేడుకలకూ బాదుడే..

ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడాప్రాంగణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ప్రాంగణంలో నేల హెచ్చుతగ్గుల పనులకు (లెవలింగ్‌), మెయిన్‌గేటు, పడమర గేటు ప్రవేశమార్గాల వైపు ఉన్న క్రీడాగ్యాలరీలకు రంగులు, వాహన పార్కింగ్‌ ఏరియాల్లో మెరక ఇలా 9 రకాల పనుల పేరిట నగరపాలక ఖజానా నుంచి రూ.37.55 లక్షలు ఖర్చుచేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలకు నగరపాలక సంస్థ రూ.కోట్లలో వ్యయం చేయగా, ఆ సొమ్మును తిరిగివ్వడంలేదు. ఇక రాబట్టుకునేందుకు పాలకులు, అధికారులు కాసింత సాహసమూ చేయలేకపోతున్నారు.

పథకాలు పట్టాలు, రిజిస్ట్రేషన్లు..!

పేదల ఇంటి పట్టాల పంపిణీ పేరిట మే 25, 26న సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించగా, అప్పుడు హాజరైన మహిళల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటి అద్దెకు రూ.1.46 లక్షలు వెచ్చించగా, వాంబేకాలనీ, రాజరాజేశ్వరీపేట, కుందావారి కండ్రిక, దేవినగర్‌, సింగ్‌నగర్‌లలో వైఎస్సార్‌ ఆసరా లబ్ధిదారులతో నగర ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు కార్యక్రమాలు నిర్వహించగా... షామియానాలు, కుర్చీలు, గ్రీన్‌కార్పెట్లు, సౌండ్‌ సిస్టమ్‌, వాటి అద్దెలకు రూ.8.70 లక్షలు వ్యయం కాగా, ఆ మొత్తాన్ని నగరపాలకపై మోపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూ రాజరాజేశ్వరీపేటలో పేదల ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించగా.. ఏర్పాట్లకు రూ.1.57 లక్షలు ఖర్చుపెట్టారు. జూన్‌లో సత్యనారాయణపురం ఏకేటీపీఎం పాఠశాలలో ‘జగనన్న విద్యాదీవెన’ నిర్వహించగా, ఇందుకు రూ.55 వేలు వెచ్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని