logo

దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌పై విచారణ చేపట్టాలి: బొండా

నగరంలోని దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌పై ప్రభుత్వం సీబీ సీఐడీ, విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేపట్టాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 23 Sep 2023 04:57 IST

మొగల్రాజపురం(చుట్టుగుంట), న్యూస్‌టుడే : నగరంలోని దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌పై ప్రభుత్వం సీబీ సీఐడీ, విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేపట్టాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మొగల్రాజపురంలోని నివాస కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ అవినీతితో బ్యాంకు దివాలా తీసిందని ఆరోపించారు. రూ. వందల కోట్లకు సంబంధించి డిపాజిట్‌దార్లకు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. పొదుపు ఖాతాదారులకు కూడా నగదు చెల్లింపులు చేసే పరిస్థితి లేదని వారు వాపోతున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బినామీల పేరుతో కమర్షియల్‌ లోన్లు మంజూరు చేశారని, ఇది ఆర్బీఐ, రాష్ట్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ చట్టం ఉల్లంఘనేనని ధ్వజమెత్తారు. బ్యాంకులో రుణాల కోసం పెట్టిన హామీ పత్రాలు, బంగారు ఆభరణాలపై కూడా ఖాతాదారుల నుంచి అనుమానాలు వినిపిస్తున్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా సాఫీగా సాగుతూ రూ.200కోట్ల మేర డిపాజిట్లు ఉన్న బ్యాంకు దివాలా తీయడానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెలంపల్లి, బ్యాంకు ఛైర్మన్‌, డైరెక్టర్ల జోక్యంతోనే బ్యాంకు పరిస్థితి దిగజారిందన్నారు. దీనికి సంబంధించిన వైకాపా నాయకులను శిక్షించాలని తెదేపా డిమాండ్‌ చేస్తోందన్నారు. మరో అగ్రిగోల్డ్‌ కానివ్వమని, ఖాతాదారులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. 2019 నుంచి కమర్షియల్‌, గోల్డ్‌ లోన్లు ఎంత ఇచ్చారనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్‌, దెందుకూరి మురళీకృష్ణంరాజు, చల్లగాలి డేవిడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని