logo

వైద్య బిల్లుల రీయంబర్స్‌మెంట్‌ అక్రమాల్లో.. కదిలిన డొంక..?

వైద్య బిల్లుల రీయంబర్స్‌మెంట్‌ పేరుతో రూ.లక్షల్లో స్వాహా చేసిన సంఘటనలో ఏడుగురు అధికారులపై కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది.

Published : 23 Sep 2023 04:57 IST

ఏడుగురు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

కూచిపూడి, న్యూస్‌టుడే: వైద్య బిల్లుల రీయంబర్స్‌మెంట్‌ పేరుతో రూ.లక్షల్లో స్వాహా చేసిన సంఘటనలో ఏడుగురు అధికారులపై కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది. చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగ విరమణ చేసిన పంచాయతీరాజ్‌ ఏఈ ఎస్‌.పోతురాజు మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ బిల్లుల కింద నకిలీ మంజూరు పత్రాలను ఉపయోగించి మొవ్వ సబ్‌ ట్రెజరీ కార్యాలయం నుంచి రూ.41.86 లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు రూ.5 లక్షలు పైబడి అయిదు బిల్లులు ఉపయోగించి రూ.32.90 లక్షలు, రూ.2 లక్షలలోపు వంతున 9 బిల్లుల కింద రూ.8.96 లక్షలు డ్రా చేశారు. ఈ విషయం ఆలశ్యంగా గుర్తించిన జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్‌ దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని చల్లపల్లి ఎంపీడీవోను కోరారు. విషయం బయట పడడంతో అధికారుల సంప్రదింపుల అనంతరం సొమ్ము స్వాహా చేసిన విశ్రాంత ఏఈ ప్రభుత్వ ఖజానాకు దశలవారీగా తిరిగి రూ.23 లక్షలు జమ చేశారు. అనంతరం జిల్లా ట్రెజరీ సహాయ అధికారిణి, అకౌంట్స్‌ అధికారిణి అయిన ఎం.వి.పి.శ్రీదేవిని తనిఖీ అధికారిగా నియమించారు. నకిలీ మంజూరు పత్రాలతో ప్రభుత్వ నగదు దుర్వినియోగమైందని, అందుకు కారకులైన ఏడుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కూచిపూడి ఎస్‌ఐ సందీప్‌కు ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్‌ ఏఈగా ఉద్యోగ విరమణ చేసిన ఎస్‌.పోతురాజుతోపాటు చల్లపల్లి ఎంపీడీవో కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ వై.శ్యామ్‌సన్‌బాబు, ఇన్‌ఛార్జి ఎంపీడీవోలుగా పని చేసిన కె.వి.సుబ్బారావు, ఎ.అరుణకుమారి, ఎంపీడీవో సీహెచ్‌.చినరత్నాలు, మొవ్వ సబ్‌ట్రెజరీ అధికారి టి.శ్రీనివాసరావు, జూనియర్‌ అకౌంటెంట్‌ బి.ప్రవీణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జిల్లా ట్రెజరీ సహాయ అధికారిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూచిపూడి ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని