logo

బంగారు బిస్కెట్ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు వస్తువులు తయారు చేసే ఓ వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు 270 గ్రాముల బంగారు బిస్కెట్లు చోరీ చేసిన కేసులో నిందితుడ్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అరెస్టు చేశామని గుడివాడ టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు.

Updated : 27 Sep 2023 06:32 IST

రూ.16.30 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్‌ సీఐ తులసీధర్‌

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: బంగారు వస్తువులు తయారు చేసే ఓ వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు 270 గ్రాముల బంగారు బిస్కెట్లు చోరీ చేసిన కేసులో నిందితుడ్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అరెస్టు చేశామని గుడివాడ టూటౌన్‌ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు. స్థానిక టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుడివాడ శ్రీనివాసమహల్‌ సెంటర్లో బాలాజీ సాయోజి దేవ్‌కర్‌, కిరణ్‌ పుండేకర్‌, సంజయ్‌ ఉవులే బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవిస్తున్నాస్తారు. వారంతా పట్టణంలోని నైజాంపేటలో నివాసం ఉంటున్నారు. వారితో పరిచయం ఉన్న వినోద్‌ సుభాష్‌ పాటిల్‌ కొంతకాలం వారి వద్ద పని చేసి మానేశాడు. ఈ నెల 14న వినోద్‌ పాటిల్‌ వారి ఇంటికి వెళ్లి ఎవరూ లేకపోవడాన్ని చూసి ఇంట్లో ఉన్న 270 గ్రాముల 6 బంగారు బిస్కెట్లను చోరీ చేశాడు. దీంతో సంజయ్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా నైజాం పేటలో బంగారు నగల తయారీదారుల ఇంటి ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించి వినోద్‌ పాటిల్‌ను గుర్తించి అతని చరవాణి జీపీఎస్‌ ఆధారంగా అతడే ఈ నేరం చేసినట్లు నిర్ధారించుకొని అరెస్టు చేశామన్నారు. అతని నుంచి రూ.16.30 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని అతడ్ని కోర్టుకు తరలించామని సీఐ తెలిపారు.


అక్రమ తవ్వకాలపై కొరడా

మైనింగ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న యంత్రాలు, టిప్పర్లు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం వెదురుపావులూరు రెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా సాగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ అధికారులు మంగళవారం దాడి చేశారు. జిల్లా మైనింగ్‌ అధికారి ఆర్‌.ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని ఏజీ కొండారెడ్డి బృందం సుమారు నెల రోజుల పాటు కాపుకాసి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు సాయంత్రం 4 గంటలకు పురుషోత్తపట్నం-ముస్తాబాద గ్రామ సరిహద్దులోని వెదురుపావులూరు కొండ ప్రాంతంలోకి వెళ్లిన మైనింగ్‌ అధికారులు.. తవ్వకాలు చేస్తున్న మూడు భారీ పొక్లెయిన్‌లు, మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్‌ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో తవ్వకందారులు యంత్రాలు తాళాలు తీసుకొని పరారయ్యారు. అతికష్టం మీద విజయవాడ, గుంటూరు నుంచి యంత్రాల తాళాలు తీసే నిపుణులను పిలిపించి మరీ రాత్రి 10 గంటల సమయంలో మిషనరీని గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నది ఎక్కడి వారన్న ఇతర విషయాలను ఆరా తీస్తున్నారు. తవ్వకం దారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్క వెదురుపావులూరులోనే సుమారు లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తరలిస్తున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరించడంతోనే తవ్వకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


కరకట్టపై బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : కరకట్టపై బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రొయ్యూరు గ్రామం వద్ద చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తోట్లవల్లూరు మండలం రొయ్యూరు శివారు పొట్టిదిబ్బలంకకు చెందిన నడకుదురు భారతి(72)ని మనవడు ఫణికుమార్‌ బైక్‌పై విజయవాడ తీసుకువెళ్తున్నాడు. కరకట్టపై రొయ్యూరు గ్రామ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా భారతి(72)కి తలకు తీవ్ర గాయమైంది. ఆమెను వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతి చెదింది. మంగళవారం ఆస్పత్రి వర్గాలు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. భారతి కుమార్తె శివలక్ష్మి ఇబ్రహీపట్నంలో ఉంటోంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆస్పత్రిలో చూపించడానికి కుమారుడు ఫణికుమార్‌ను పంపించింది. అతడు అమ్మమ్మను తీసుకొని వచ్చే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మనవడు ఫణికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.విశ్వనాథ్‌ మంగళవారం తెలిపారు.


వదినను దూషించిన మరిదికి ఏడాది జైలు

గన్నవరం గ్రామణం, న్యూస్‌టుడే: ఆస్తి వివాదం నేపథ్యంలో వదినతో అసభ్యంగా ప్రవర్తించిన మరిదికి ఏడాది జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ గన్నవరం 12వ అదనపు న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన కొల్లి శ్రీనివాసరావు, ప్రసన్నలకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు, అతడి సోదరుడు శ్రీకాంత్‌కు కొంతకాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. పది మందిలో అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలకు దిగుతూ.. తనను శారీరకంగా, మానసికంగా మరిది శ్రీకాంత్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కొల్లి ప్రసన్న 23.10.2021న గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో నేరం నిరూపణ కావడంతో ముద్దాయి కొల్లి శ్రీకాంత్‌కు ఏడాది జైలు, రూ.పది వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


వినాయక ఊరేగింపులో వివాదం : ఇరువర్గాలపై కేసులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గణపతి నవరాత్రులు పురస్కరించుకొని నిర్వహించిన ఊరేగింపులో వివాదం తలెత్తి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పట్టణంలోని పెద్దవీధిలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పందిరిలో గణనాథుడ్ని  సోమవారం నిమజ్జనం చేయడానికి ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో పూర్తిగా రంగా పాటలు పెట్టారని వివాదం తలిత్తెంది. ఈ విషయంలో చిల్లుముంత రమాదేవి కుటుంబంపై పొగిరి వసంత్‌, ఉత్తరాల కృష్ణ, బసవకుమారి, పావని, మణి, రోహిత్‌ దాడి చేశారని రమాదేవి ఫిర్యాదు చేశారు. అలాగే ఉత్తరాల కృష్ణ అతని వర్గీయులపై చిల్లుముంత అజయ్‌కుమార్‌, భరత్‌, వినయ్‌, మహేష్‌ కర్రలతో దాడి చేసి గాయపరిచారని కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇది ముమ్మాటికీ పౌర హక్కుల ఉల్లంఘనే..!

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: పౌర హక్కులను హరిస్తున్న ప్రభుత్వపు వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు విడుదలకు కొండపల్లి పురపాలిక నుంచి విజయవాడలోని దుర్గమ్మ, గుణదల మేరిమాతను వేడుకొనేందుకు వెళుతున్న తెదేపా మహిళా కౌన్సిలర్లను మంగళవారం పోలీసులు అడ్డగించి ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించి మాట్లాడారు. సమస్యలపై నిరసన తెలియజేసే పౌర హక్కును పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న ఈ ప్రభుత్వం మరెంత కాలం ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు గమనించి వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరారు.


రఘునందన్‌కు జాషువా జాతీయ సాహితీ పురస్కారం

తిరువూరు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రేపాక రఘునందన్‌ గుర్రం జాషువా జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్రను తెలుగు, హిందీ భాషల్లో ఆయన రచించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దేశంలోనే మొదటిసారి పైడిమర్రి ముఖచిత్రంతో పోస్టల్‌ కవరు విడుదలకు ఎనలేని కృషి చేశారు. పత్రికల్లో అనేక కవితలు, వ్యాసాలు, కథలు రాయడమే కాకుండా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఉపన్యాసాలు, కవితా పఠనం ద్వారా రఘునందన్‌ సుపరిచితులు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ బహుజన రచయితల వేదిక ఈ పురస్కారం ప్రకటించింది. 28న ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు.


జనసేన హోర్డింగ్‌ల ఏర్పాటును అడ్డుకున్న అధికారులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక సీతాయిలంక సెయింట్‌ ఆన్స్‌ ఆసుపత్రి వద్ద స్తంభాలు పాతి శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లను ఆర్‌ అండ్‌ బీ అధికారులు అడ్డుకున్నారు. అక్టోబర్‌ ఒకటిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర అవనిగడ్డలో ప్రారంభం కానున్న సందర్భంగా ఆ పార్టీలో చేరడానికి ఒకరు శాశ్వత ప్రాతిపదికన ఇనుప స్తంభాలు పాతిస్తుండగా ఆర్‌ అండ్‌ బీ అధికారులు అడ్డుకొని బుధవారం మధ్యాహ్నంలోగా కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకురావాలని, లేకపోతే తొలగిస్తామని డీఈ వరలక్ష్మి చెప్పారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని