logo

ఆంక్షలకు వెరవక.. ఆకాంక్షన విడవక

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

Updated : 27 Sep 2023 06:33 IST

బాబుకు అండగా తెలుగు తమ్ముళ్ల దీక్షాపథం

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆందోళనలు హోరెత్తుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. రిలే దీక్షలతోపాటు... పలువురు నేతలు బుధవారం నిరవధిక దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. శాంతియుత నిరసనలు చేపడుతున్నా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రిలేదీక్షలు, జలదీక్షలు, కాగడాల ప్రదర్శనలు విస్తృతంగా నిర్వహించారు. మహనీయుల విగ్రహాలకూ వినతి పత్రాలు అందజేశారు. సైకో పోవాలి... సైకిల్‌ రావాలని నినదించారు. సీఎం జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు చేయకుండా.. జగన్‌ తన సొంత ఎజెండాతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు.

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే బృందం


విజయవాడ మధ్య

అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్‌ తెదేపా కార్యాలయంలో నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు దీక్షలు చేపట్టారు. బొండా ఉమామహేశ్వరరావు వచ్చి సంఘీభావం తెలిపి ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.


విజయవాడ తూర్పు

జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నిరసనలో జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ మాట్లాడుతూ జగన్‌ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని ఆరోపించారు.


నందిగామ

తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చందర్లపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.    


పెనమలూరు

పోరంకి తెదేపా కార్యాలయంలో శిరోముండనం చేయించుకొని దీక్షలో పాల్గొన్న తెదేపా ఎస్సీ నేతలు బొంగరాల అబ్రహం, ఈడ్పుగంటి హజరయ్య. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ పాల్గొన్నారు.


విజయవాడ

ముఖ్యమంత్రి  జగన్‌.. అంబేడ్కర్‌ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తెదేపా కార్పొరేటర్లు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి విన్నవించారు.


కొండపల్లి

బాబు బాగుండాలని కోరుతూ... విజయవాడలోని దుర్గమ్మకు పూజలు, గుణదల మేరీమాత సన్నిధిలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరిన తెదేపా కొండపల్లి పట్టణ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు.


జగ్గయ్యపేట

జగ్గయ్యపేట తెదేపా కార్యాలయంలో దీక్షల్లో శ్రేణులు.. మహిళలు పాల్గొన్నారు. అరాచక, విధ్వంస పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. వీరికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీరాం తాతయ్య దంపతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పెనుగంచిప్రోలు మండలం కొణకంచిలో కొవ్వొత్తుల ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలతో శ్రీరాం తాతయ్య పాల్గొని నిరసన తెలిపారు.


విజయవాడ పశ్చిమ

పాతబస్తీ తెదేపా కార్యాలయంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సాలంకి రాజు జైన్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.


తిరువూరు

చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరువూరులో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యావల దేవదత్‌, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు పాల్గొన్నారు.


మైలవరం

మైలవరంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో తెదేపా, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. సైకో పోవాలి...సైకిల్‌ రావాలని నినాదాలు చేశారు. జి.కొండూరు మండలం కోడూరులో తెదేపా శ్రేణులు కొవ్వొత్తులతో ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని